ముఖ్యమంత్రి హోదాలో సొంతూరికి వెళుతున్న జగన్...అందుకే !
posted on Jul 6, 2019 9:10AM

ఏపీ సీఎం అయ్యాక ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటి సారిగా వైఎస్ జగన్ కడప జిల్లాలోని పులివెందుల సహా పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి ఘాట్ ఉన్న ఇడుపులపాయకు వెళ్లనున్న జగన్, అక్కడ నివాళులర్పించిన అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గండి క్షేత్రంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం, పులివెందులలో డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీకి అనుబంధంగా అరటి రీసెర్చ్ స్టేషన్ కు శంకుస్థాపన చేయనున్నారు.
ఆ తర్వాత జమ్మలమడుగులో జరిగే సభలో రైతులకు మద్దతు ధర, వైఎస్సార్ పెన్షన్ కానుక పథకాలను ప్రారంభిస్తారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా క్వింటాల్ శనగలకు అదనంగా 1,500 వైఎస్సార్ పెన్షన్ రూ. 2250లను లబ్దిదారులకు జగన్ అందించనున్నారు. ఇక జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందగా, పార్టీ నేతలు వైఎస్ అవినాశ్ రెడ్డి, వైఎస్ కొండారెడ్డి తదితరులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇక జమ్మలమడుగు సభ జరిగే చోటుని కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతితో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. రూట్ మ్యాపు, హెలిప్యాడ్ ల గురించి ఆయన వైసీపీ నేతలతో చర్చించారు.