రేవంత్ కు పీసీసీ పదవి వచ్చింది ఆయన వల్లేనట! 

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీనే సాగింది. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మరికొందరు రేసులో నిలిచారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య చివరి వరకు హోరాహోరీ నడిచింది. దాదాపు ఆరు నెలల పెండింగ్ తర్వాత చివరికి మల్కాజ్ గిరి ఎంపీ, ఫైర్ బ్రాండ్ లీడర్ గా పిలుచుకునే రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. రేవంత్ నియామకం తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెట్టి బహిరంగంగానే అసమ్మతి స్వరం వినిపించారు. కాని వెంటనే ఆయన సైలెంట్ కావడం జరిగింది.

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి షో నడుస్తోంది. పీసీసీ చీఫ్ గా పార్టీలో కొత్త జోష్ నింపారు రేవంత్ రెడ్డి. వరుస కార్యక్రమాలతో అధికార పార్టీకి చుక్కలు చూపించడంతో పాటు కేడర్ ను ఉత్తేజపరుస్తున్నారు. రేవంత్ ఎఫెక్టుతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు యాక్టివ్ అయ్యారు. ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ పోరాడుతున్నారు. దళిత గిరిజన దండోరా సభలతో  ప్రభుత్వంపై రేవంత్  రెడ్డి సమర శంఖం పూరిస్తున్నారు. పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తూ.. సీనియర్లందరినీ కలుపుకునిపోయే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ కొంపల్లిలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు టీపీసీసీ చీఫ్ పదవి దక్కడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. 

నిజామాబాద్‌లో చేపట్టిన రాజీవ్ రైతు దీక్ష వల్లే తనకు టీపీసీసీ చీఫ్ పదవి దక్కిందన్నారు రేవంత్ రెడ్డి. ఆ సభ విజయవంతమైన విషయం ఢిల్లీ పెద్దలకు చేరిందన్నారు. టీపీసీసీ పదవి ఎంపికకు సంబంధించి సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని రేవంత్ చెప్పారు. హైకమాండ్ తనమీద పెట్టుకున్న నమ్మకాన్నినిలబెట్టుకుంటానని తెలిపారు రేవంత్ రెడ్డి. పార్టీలో గ్రూపులు లేవన్న రేవంత్ రెడ్డి.. అందరం కలిసే పోరాడుతామని చెప్పారు. తనకు పీసీసీ చీఫ్ రావడానికి రేవంత్ రెడ్డి చెప్పిన కారణాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. 

కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ భయంతోనే తెలంగాణ,ఆంధ్రా ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ సైతం ఒకసారి ఎమ్మెల్యేగా,సింగిల్ విండో ఛైర్మన్‌గా ఓడిపోయారని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్‌ను డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ బహుజన భవన్‌గా మారుస్తామని ప్రకటించారు. దళిత, గిరిజన, ఆదివాసీల పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా ఉత్పత్తి చేసే కర్మాగారంగా దాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. తనకు ఎలాంటి కోరికలేవని.. దేవుడు తనకు అన్నీ ఇచ్చాడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చునని... పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయిన వ్యక్తితో దళిత, గిరిజన, ఆదివాసీల విద్యకు ప్రత్యేక బడ్జెట్‌ పెట్టిస్తానని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu