కేసీఆర్ తాగుడుకు, కేటీఆర్‌ డ్రగ్స్‌కు అంబాసిడర్లు.. గ‌జ్వేల్‌లో రేవంత్ గ‌ర్జ‌న‌..

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రెచ్చిపోయారు. కేసీఆర్ ఇలాఖా కావ‌డంతో మాంచి కాక మీదున్నారు. గ‌జ్వేల్‌లో 2 ల‌క్షల మందితో ద‌ళిత‌, గిరిజ‌న దండోరా స‌భ‌ను నిర్వ‌హించి తిరుగులేని స‌త్తా చాటారు. భారీ బ‌హిరంగ స‌భ‌కు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌చ్చిన జ‌నాల‌ను చూసి రేవంత్‌రెడ్డి పూన‌కంతో ఊగిపోయారు. కేసీఆర్‌, కేటీఆర్‌పై మాట‌ల‌తో విరుచుకుప‌డ్డారు. 

ద‌ళిత గిరిజ‌న‌ దండోరా కావ‌డంతో ప్ర‌ధానంగా ఎస్సీ, ఎస్టీలకు జ‌రుగుతున్న అన్యాయం గురించే నిల‌దీశారు. జనాభా ప్రాతిపదికన కింద నిధులకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తే దానిని పక్కన పెట్టి లక్ష కోట్లు పక్కదారి పట్టించార‌ని మండిప‌డ్డారు. కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతినడానికి తాగుడే కార‌ణ‌మ‌న్నారు. 3.5 కోట్లు ఉన్న జనాభా 4 కోట్లు అయితే, తాగుబోతులను మాత్రం 3 రేట్లు పెంచిండని మండిప‌డ్డారు. సినిమా వాళ్లతో తిరిగిన కేటీఆర్ ఈడీ కేసులో ఇరుక్కున్న వారిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

తండ్రి తాగుబోతులకు.. కొడుకు డ్రగ్ తీసుకునే వాళ్లకు అంబాసిడర్ గా మారారు. పోరాటాలకు అడ్డాగా ఉన్న గడ్డను తాగుబోతులకు అడ్డాగా మారుస్తుంటే మనం మౌనంగా ఉందామా అని నిల‌దీశారు. 9,10 తరగుతుల పిల్లలు గంజాయి, డ్రగ్స్ తీసుకుంటున్నారు ఓ సారి ఆలోచించు కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. 

తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కారు, ఇళ్లు లేని కేసీఆర్.. అటుకులు తిని ఉద్యమం చేశాన‌న్నారు.. మ‌రిప్పుడు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలు ఆలోచించాల‌ని పిలుపు ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పండించేది పంట కాదు.. అవినీతి పంట అని అన్నారు.

సైదాబాద్‌లో జరిగిన హత్యాచారం త‌న‌ను కలిచివేసిందని... కానీ నేరస్థుడు అరెస్ట్ కాకముందే.. పట్టుకున్నామని కేటీఆర్‌ ట్విట్టర్ల పెట్టి మళ్లీ సరిదిద్దుకుంటున్నా అని చెప్పిండే కానీ.. కుటుంబాన్ని పరామర్శించలే.. నేరగాళ్లను ఇట్టే పట్టుకునేందుకు నగరంలో 7 లక్షల కెమెరాలు ఉన్నాయని డీజీపీ చెప్పారు కదా.. నిందితుడిని 7 రోజులైనా పట్టుకోలేదు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ తెలంగాణ చైతన్యం చూపెట్టి కేసీఆర్‌కు గోరి కట్టాలి. తెలంగాణ సమాజం కళ్లు తెరిస్తే కేసీఆర్ కాలిపోతడని తెలియజెప్పాలి అని అన్నారు.

12 శాతం ఉన్న మాదిగలకు మంత్రి పదవిని ఇవ్వలేదు. కేసీఆర్‌కు నిజంగా దళితులపై అభిమానం ఉంటే ఆయ‌న‌ ఇంట్లో ఉన్న ఓ మంత్రి పదవిని తీసేసి మాదిగ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వండి. కొండపోచమ్మ ప్రాజెక్టు కింద 14 గ్రామాలను నట్టే ముంచారని, 14 గ్రామాల ప్రజలకు నిలువ నీడ లేకుండా చేశారని ఆరోపించారు. 

బూత్ కు 9 మంది చొప్పున నడుము బిగించి తుది దశ తెలంగాణ కోసం తరలిరండి. వారిని గుర్తించి గుండెల్లో పెట్టుకుంటాం. రాబోయే 19 నెలలు తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించబోతోంది. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగుల కోసం పరేడ్ గ్రౌండ్‌లో ధర్మ యుద్ధం చేద్దామని గ‌జ్వేల్ గ‌డ్డ నుంచి పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.