ఇరాన్- ఇజ్రాయెల్ మధ్యఈ యుద్ధం అసలెందుకు?.. అమెరికా పాత్ర ఎంత?
posted on Jun 16, 2025 12:48PM
.webp)
ఇజ్రాయెల్ ఒక మొండి దేశం. దీని మెయిన్ పాలసీ శిక్షించు, తుద ముట్టించు. మనతో యుద్ధం అని భావించడానికే భయపడాలి. మనపై దాడి చేయడానికే దడుచుకోవాలి? ఇదీ ఇజ్రాయెల్ బేసిక్ థియరీ. కేవలం దేశాలు వాటి సైన్యాలు ఇతరత్రా వ్యవస్థల మీద మాత్రమే కాదు.. వ్యక్తుల మీద కూడా ఇజ్రాయెల్ కన్నేసిందంటే వారు నామ రూపాల్లేకుండా పోతారు. కావాలంటే ఇదే యుద్ధంలో చూడండి.. ఇరానీ అణు శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ ఏ విధంగా మట్టుబెట్టిందంటే.. టెహ్రాన్ లో కారు బాంబులు పెట్టి ఆరుగురు అణు శాస్త్రవేత్తలను తుదముట్టించేసింది. దీనికి కారణమేంటంటే గత కొంత కాలంగా ఇరాన్ ఇజ్రాయెల్ పై అణు దాడి చేస్తానని చెప్పడమే.
కేవలం మాటలే కదా? అన్న కోణంలో కొన్నాళ్ల పాటు ఏమరపాటుగా ఉంటూ వచ్చింది ఇజ్రాయెల్. ఈ లోగా అణు నిర్వహణ సంస్త ఒక ప్రకటన చేసింది. గత ఇరవై ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ అణు నియమాలను ఉల్లంఘించినట్టు తేల్చి చెప్పింది. దీనంతటికీ కారణం ఇరాన్ పెద్ద ఎత్తున యురేనియం శుద్ధి చేయటమే. ఈ మొత్తం యురేనియంతో 9 అణుబాంబులు చేయవచ్చు. ఈ వార్త ఎప్పుడైతే తెలిసిందో ఇక ఇజ్రాయెల్లో ఓపిక నశించి పోయింది. దీంతో ఎలాంటి ప్రకటనల్లేకుండా వారికెంతో పవిత్రమైన శుక్రవారం తెల్లవారు జామున మూడున్నర గంటల సమయంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై భీకర దాడులకు తెగబడింది ఇజ్రాయెల్. ఆ దేశ అణు నిల్వలుండే ప్రాంతం నటాంజ్ పై భారీగా విరుచుకుపడింది. దీంతో నేలమాళిగలో ఉన్న అణు కేంద్రం పై కప్పు దారుణంగా దెబ్బ తినింది. ఇక టెహ్రాన్ కి వంద కిలోమీటర్ల దోరంలో ఉండే మరో అణు కేంద్రంపైనా దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయడం మాత్రమే కాకుండా.. ఆ దేశ ఆర్ధిక మూలాలైన చమురు బావులు, ఇంకా గ్యాస్ నిల్వలపైనా దాడులు చేసింది. ఒకే సారి 11 గ్యాస్ ట్యాంకులను పేల్చడంతో అవి ఒక్కొక్కటీ పేలుతూ భారీ అగ్ని కీలలు ఎగసిపడ్డం ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది.
తొలి రోజు అంటే శుక్రవారం చేసిన దాడిలో ఇరానీయన్ సైనిక అధికారులతో పాటు, అణు సైంటిస్టులను సైతం మట్టుబెట్టడంతో పాటు వంద మంది వరకూ చనిపోయినట్టు చెప్పింది ఇరాన్ స్టేట్ టీవీ. ఇదిలా ఉంటే శనివారం ఆర్ధిక మూలాలపై దెబ్బ తీసి దారుణమైన నష్టాన్ని కలిగించింది. ఇది మా దేశంపై ఆర్ధికంగా ఎంతో ప్రభావం చూపుతుందని ప్రకటించింది ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ. ఆదివారం ఒక అపార్ట్ మెంట్ పైనా ఇజ్రాయెల్ దాడి చేయడంతో 29 మంది చిన్నారులతో పాటు 60 మంది పౌరులు మరణించారు.
ఇరాన్ సైతం ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు చేసింది. మే నాలుగున ఆ దేశ రక్షణ మంత్రి తమ దగ్గర 1200 కి. మీ రేంజ్ అత్యాధునిక మిస్సైల్ ఉందని. అది ఇజ్రాయెల్ పై వాడబోతున్నామని ప్రకటించినట్టే వాటిని వాడింది. హజ్ ఖాసిం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేసింది. ఇరాన్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్లోనూ మరణాలు సంభవించాయి. అయితే ఈ దాడుల వెనక అమెరికా పాత్ర ఉన్నట్టు అనుమానిస్తోంది ఇరాన్. కారణం గత కొంత కాలంగా ఇరాన్- అమెరికా మధ్య అణు ఒప్పందా చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఎంతకీ తెలడం లేదు. దీంతో అమెరికా ఇజ్రాయెల్ చేత ఈ దాడులు చేయిస్తున్నట్టుగా అనుమానిస్తోంది ఇరాన్. అన్నట్టుగానే ట్రంప్ కూడా మాతో అణు ఒప్పందం ఇకనైనా చేసుకోవాల్సిందిగా అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇప్పుడు చేసుకోకుంటే ఇరాన్ సామ్రాజ్యంలో ఏదీ మిగలదని హెచ్చరిస్తున్నారు.
అయితే దీన్ని ఇరాన్ విదేశాంగ శాఖ ఖండిస్తోంది. ఈ సమయంలో అణు ఒప్పందాలు చేసుకోవడమేంటన్నది ఇరాన్ వాదన. అంతే కాదు ఒక పక్క ఇజ్రాయెల్ దాడులకు మద్ధతు తెలుపుతూ మరో పక్క మాతో ఒప్పందాలు చేసుకోడానికి ఎగబడ్డమా? అన్నది ఇరాన్ ప్రధాన ఆరోపణ.
అయితే అమెరికా మాత్రం అక్కడ యుద్ధం జరుగుతుందా లేదా? అన్నది చూడదు. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధంలో ఉండగానే.. పదేళ్ల ఖనిజ ఒప్పందం చేసుకోవడం చూసే ఉంటాం. భారత్- పాక్ మధ్య ఘర్షన సైతం క్యాష్ చేసుకోవాలని చూసింది యూఎస్. ఇప్పుడు ఇరాన్- ఇజ్రాయెల్ వార్ వంతు. ఈ దాడులతో తమకెలాంటి సంబంధం లేదంటూనే తాను చెబితే ఈ యుద్ధం క్షణాల్లో ఆగిపోతుందని అంటున్నారు ట్రంప్.. ఒక పక్క చూస్తే క్రూడ్ ఆయిల్ ధరలు 150 డాలర్లకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయ్.
దీనంతటి వెనక అమెరికా యుద్ద పన్నాగం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు పశ్చిమాసియా వ్యవహారాల నిపుణులు. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగదని వైట్ హౌస్ చేస్తున్న ప్రకటన బట్టీ చూస్తుంటే.. ఇందులో ఒప్పందాల తాలూకూ ఒత్తిడులున్నాయని. ఇజ్రాయెల్ ని ఒక బూచిగా చూపించి ఇరాన్ చేత అణు ఒప్పందాలు చేసుకోవడమే లక్ష్యంగా అమెరికా ఇదంతా చేయిస్తోందన్న మాట వినిపిస్తోంది.