రియల్ లీడర్ వర్సెస్ డమ్మీ లీడర్
posted on Feb 19, 2025 7:34PM

రాజకీయాల్లో తరాలు మారుతున్నాయి.. ఒక్కొ తరానికి కొందరు నేతలు ప్రజల అభిమానాన్ని చూరగొట్టూ చరిత్ర పుటల్లో నిలిచిపోతూ వచ్చారు. అదేసమయంలో యువతకు టార్చ్ బేరర్ గానూ మారుతూ కొత్త రాజకీయాలకు పునాదులు వేశారు. ఈ కోవలో ప్రముఖంగా గుర్తుకొచ్చే పేర్లు ఎన్డీఆర్, చంద్రబాబు నాయుడు. ఎన్డీఆర్ హయాంలో బీసీ, ఎస్సీ వర్గాల ప్రజలు రాజకీయాల్లో రాణించారు. అప్పటి వరకు రాజకీయాలంటే ఆమడదూరం ఉండే ఆ వర్గాల ప్రజలు.. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో రాజకీయాల్లో కీలక భూమిక పోషించడం ప్రారంభమైంది. అదే ఒరవడిని చంద్రబాబు నాయుడుకూడా కొనసాగించారు. అంతేకాదు.. క్రమశిక్షణతో ఎలా రాజకీయాలు చేయాలో చంద్రబాబు నేర్పించారు. ఫ్యాక్షన్ పల్లెల్లోనూ అభివృద్ధికి బాటలువేసి శాంతిని నెలకొల్పారు. ఐటీ రంగాన్ని అభివృద్ధిచేసి తెలుగు రాష్ట్రాల్లోని యువత ఇతర దేశాల్లో ఐటీ రంగంలో అగ్రగామిగా నిలిచేలా చేశారు. చంద్రబాబు చూపిన మార్గంలో పయణించిన యువత నేడు ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. అయితే, గడిచిన ఐదేళ్లు అధికారంలో కొనసాగిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం రాజకీయాల అంటే కొట్టుకోవటం, బూతులు తిట్టడం అన్నట్లుగా మార్చేశారు.
వైసీపీ ఐదేళ్ల కాలంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలే లేకుండా చేశారు. ఉన్న పరిశ్రమలను తరిమేసి.. ఏపీ అంటేనే పెట్టుబడి దారులు భయపడేలా చేశారు. అక్కడితో ఆగలేదు అక్రమ కేసులుపెట్టి చంద్రబాబుసహా అనేక మంది ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు చేయించారు. జైళ్లలో పెట్టించారు. ఒకపక్క ఎన్టీఆర్ హయాంనుంచి ఫ్యాక్షన్ రాజకీయాలు క్రమంగా తగ్గుకుంటూ వస్తున్న వేళ.. ఫ్యాక్షన్ మూలాలు కలిగిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మళ్లీ రాష్ట్రంలో హత్యలు, గొడవలకు కారణం అయ్యాడు. దీంతో ప్రజలు విసిగిపోయి గత ఎన్నికల్లో ఓటుద్వారా వైసీపీకి గట్టి గుణపాఠం చెప్పారు. అయినా, జగన్‌లో మార్పు రావడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీ అన్ని రంగాల్లో అబివృద్ధి పథంలో దూసుకెడుతోంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. అయితే, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేను అన్నట్లుగా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మళ్లీ అల్లర్లు చెలరేగేలా కుట్రలు చేస్తున్నారు. దీంతో ప్రజలు జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల తీరుపట్ల మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వీళ్లకు 11 సీట్లు ఇచ్చి తప్పుచేశాం అంటూ బాధపడుతున్నారు. ఒక్కటి కూడా ఇవ్వకుండా ఉండాల్సిందని భావిస్తున్నారు.
కిడ్నాప్ కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడలోని జిల్లా సబ్ జైలుకు తరలించారు. మంగళవారం విజయవాడ సబ్‌జైలుకు వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యాడు. అయితే, జైలు వద్ద సినిమా తరహాలో ఓ సీన్ జరిగింది. జగన్‌ను చూసేందుకు వచ్చిన ఓ చిన్నారి కేకలు వేస్తూ జగన్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో జగన్ ఆ అమ్మాయిని రా.. రా.. అంటూ దగ్గరకు తీసుకున్నాడు. ఇదంతా ప్రజలకు చూడటానికి ఎమోషనల్ సీన్‌లా అనిపించొచ్చు. ఎమోషనల్ సీన్లను పండించి ప్రజల సానుభూతిని పొందడంలో జగన్ దిట్ట అని ఏపీలో ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. అంతలా కోడికత్తి, బాబాయ్ హత్య, గులక రాయిలతో జగన్ ఫేమస్ అయ్యారు. అయితే, ఇక్కడ విషయం ఏమిటంటే.. వందల మంది జనం జగన్ కాన్వాయ్ చుట్టూ గుమ్మికూడారు. ఓ వ్యక్తి చిన్నపాపను తీసుకొని సరిగ్గా జగన్ వాహనం ముందుకే రావడం.. ఆ చిన్నారి కూడా కేకలు వేస్తూ, ఏడ్చుకుంటూ జగన్ జగన్ అంటూ అరవటం.. ఆ వెంటనే జగన్ ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టడాన్ని చూసిన ప్రజలు ఇదంతా వైసీపీ నాయకత్వం ముందుగానే క్రియేట్ చేసిన డ్రామా అంటూ ఈజీగా చెప్పేస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇదేక్రమంలో జగన్ మోహన్ రెడ్డికి.. మంత్రి నారా లోకేశ్ కు తేడాఇదే అంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మంత్రి నారా లోకేశ్ తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబు రాజకీయ లక్షణాలను పుణికిపుచ్చుకొని క్రమ శిక్షణ కలిగిన రాజకీయాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఈ తరానికి నారా లోకేష్ టార్చ్ బేరర్ గా కనిపిస్తున్నారు. లోకేశ్ పాల్గొన్న సభలో అతనికి దగ్గరిగా పదిహేనేళ్లలోపు పిల్లలు పార్టీ కండువా వేసుకొని, పార్టీ గుర్తుతో ఉన్న చొక్కా వేసుకొని కనిపిస్తే వాటిని వెంటనే తీయించి వేయిస్తారు. అవసరమైతే, వారి వద్దకు వెళ్లి తానే స్వయంగా తీసేస్తాడు. ఎందుకంటే.. చిన్నపిల్లలు చదువు, ఆటల మీదనే దృష్టిని కేంద్రీకరించాలి. లోకేష్ ప్రజాగళం పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఓ చిన్నారి తెలుగుదేశం జెండా పట్టుకుని, తెలుగుదేశం నేతల బొమ్మలున్న పసుపుపచ్చ చొక్కా ధరించి లోకేష్ దృష్టిలో పడ్డాడు. వెంటనే లోకేష్ ఆ పిల్లవాడి చేతిలోని తెలుగుదేశం జెండాను తీసేశారు. ఆ చిన్నారి ధరించిన తెలుగుదేశం గుర్తులున్న షర్టునూ విప్పేశారు. బుద్ధిగా చదువుకో, పెద్ద అయిన తరువాత రాజకీయాలలోకి వద్దువుగానీ అంటూ బుజ్జగించి, హితవు చెప్పారు. చిన్నతనంలోనే పిల్లలపై రాజకీయాలను రద్దొద్దన్నది లోకేశ్ ఆలోచన. కానీ, జగన్ మోహన్ రెడ్డి మాత్రం చిన్న పిల్లలైనా, పెద్దవారైనా ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు, ఓవరాక్షన్ రాజకీయాలు చేస్తే చాలు.. ప్రోత్సహిస్తుంటారు. చదువు లేకుండా యువత ఫ్యాక్షన్ రాజకీయాల్లో మగ్గిపోవాలని జగన్ ఆలోచన. దీంతో సోషల్ మీడియాలో లోకేశ్ కు సంబంధించిన వీడియోలను పోస్టుచేసి లోకేశ్‌ను చూసి రాజకీయాలు ఎలా చేయాలో నేర్చుకో జగన్ అంటూ నెటిజన్లు సూచిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్, నిన్నటి వరకు చంద్రబాబు.. ఇప్పుడు నారా లోకేశ్ చిన్నారులు, యువతకు టార్చ్ బేరర్‌గా మారుతున్నాడని ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.