గుంటూరు మిర్చియార్డులో వైసీపీ దొంగలు పడ్డారు!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లడం రైతుల‌కు శాపంగా మారింది. ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో రైతుల క‌ష్టాలు ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. రైతులపై త‌న‌కు ఎన‌లేని ప్రేమ ఉన్న‌ట్లుగా న‌టిస్తూ మిర్చి యార్డుకు వెళ్లి నానా హ‌డావుడి చేశారు. జ‌గ‌న్ మిర్చి యార్డుకు వెళ్ల‌డం వల్ల రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరడం అటుంచి  రైతుల‌పైనే వైసీపీ నేత‌లు దాడి చేశారు. దీంతో కార్య‌క‌ర్త‌ల‌తో రైతుల‌ను కొట్టించ‌డానికి జ‌గ‌న్ మిర్చి యార్డుకు వెళ్లిన‌ట్లయింది. 

మ‌రోవైపు ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గా జ‌గ‌న్ మిర్చి యార్డుకు వెళ్లడం ప‌ట్ల విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ సమావేశాలు, సభలకు అనుమతి లేదని, జగన్‌ను మిర్చి యార్డులోకి అనుమతించవద్దని గుంటూరు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోకుండా జగన్ మిర్చియార్డులోకి వెళ్లి రైతులను కలిశారు. జగన్‌ను చూసి ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు జై జగన్ అంటూ నానా హంగామా సృష్టించారు. దీంతో పంట‌ను అమ్ముకునేందుకు వ‌చ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

జ‌గ‌న్‌కు రైతుల ప‌ట్ల నిజంగా ప్రేమ ఉండి ఉంటే,  త‌న‌తోపాటు కొద్ది మంది నేత‌ల‌ను  వెంట‌పెట్టుకొని యార్డులోకి వెళ్లి రైతుల‌తో మాట్లాడి వచ్చేవారు. కానీ, జ‌గ‌న్ మాత్రం మార్కెట్లో ర‌భ‌స సృష్టించేందుకు వైసీపీ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను స‌భ‌కు తీసుకెళ్లిన‌ట్లు యార్డులోకి తీసుకెళ్లాడు. అందులోనూ అనుమ‌తి లేకుండా దౌర్జ‌న్యంగా వెళ్లారు. దీంతో పంట‌ను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వ‌చ్చిన‌ రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పైగా జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు, ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యలు చేశారు.  ఇక్క‌డ విచిత్ర‌మైన విష‌యం ఏమిటంటే, గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్ష‌ హోదా ఇవ్వ‌లేదు, అందుకే జగన్ ప్రతిపక్ష నాయకుడు కాదు. ఒట్టి ఎమ్మెల్యే మాత్రమే. ఆ సంగతి తెలిసికూడా జగన్  జ‌గ‌న్ తాను ప్ర‌తిఫ‌క్ష నేత‌నే అని ప‌దేప‌దే చెప్పుకోవ‌టం ఆయ‌న మాన‌సిక స్థితిని తెలియ‌జేస్తున్నది. మ‌రోవైపు జ‌గ‌న్ మిర్చియార్డుకు వెళ్లిన స‌మ‌యంలో రైతుల మిర్చి బ‌స్తాల‌ను దొంగ‌లు దొంగిలించారు.. ఆ  దొంగలు ఎవరో కాదు.. వైసీపీ నేత‌లే.

 గుంటూరు మిర్చి యార్డులో  రైతులకు చెందిన 14 మిర్చి టిక్కీలు మాయం అయ్యాయి. మిర్చి యార్డుకు వైఎస్ జగన్ వచ్చిన సమయంలో మిర్చి బస్తాలు మెట్టు కట్టిన చోట తోపులాట జరిగింది. భయంతో రైతులు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. కాసేపటికి  అక్క‌డికి వచ్చి చూసుకున్న రైతులు మిర్చి టిక్కీలు మాయమయ్యాయని గుర్తించారు. గుంటూరు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు సానుగంటి చైతన్య మిర్చి టిక్కీలు దొంగిలించినట్లు యార్డ్ అధికారులు గుర్తించారు. చైతన్య ఇసుజు ట్రక్కులో మిర్చి టిక్కీలు తీసుకెళ్తున్నట్లు మార్కెట్ యార్డ్ సీసీ కెమేరాల్లో స్పష్టంగా కనిపించింది. 

 పల్నాడు జిల్లా వెల్దుర్దికి చెందిన నారాయణ, వెంకట సుబ్బయ్య అనే రైతులకు చెందిన న 14 మిర్చి టిక్కీలను వైసీపీ ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు చైతన్య దొంగిలించాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా మిర్చియార్డు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు   పోలీసులు కేసు నమోదు చేసుకుని చైతన్య కోసం గాలిస్తున్నారు. దీంతో జ‌గ‌న్ తీరుపై రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మా స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌టానికి వ‌చ్చావా.. మ‌మ్మ‌ల్ని ఇబ్బంది పెట్టేందుకు వ‌చ్చావా అంటూ రైతులు జ‌గ‌న్ పై మండిప‌డుతున్నారు. 
అయితే  జ‌గ‌న్ ఎన్నడూ లేని విధంగా మిర్చిరైతులపై అంత ప్రేమ పుట్టుకురావడం,  ఉన్న‌ట్లుండి గుంటూరు మిర్చి యార్డుకు వ‌చ్చి హ‌డావుడి చేయ‌డం వెనుక పెద్ద క‌థే ఉంది. 

న‌ర్స‌రావుపేట తెలుగుదేశం ఎంపీ కృష్ణ దేవ‌రాయులు  మిర్చికి మ‌ద్ద‌తు ధ‌ర‌పై పార్లమెంటులో ప్రశ్నించారు. అంతే కాకుండా స్వయంగా ప్రధాని మోడీకి మిర్చి రైతుల సమస్యపై రిప్రజంటేషన్ ఇచ్చారు. అంత‌ర్జాతీయంగా మార్కెట్ రేటు ప‌డిపోవ‌టంతో మిర్చి ధ‌ర త‌గ్గింద‌ని, దీని వ‌ల్ల రైతుల‌కు న‌ష్టం జ‌రుగుతోందనీ ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లారు. ఫండ్ క్రియేట్ చేసి మిర్చి రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని   విజ్ఞ‌ప్తి చేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాశారు.   దీంతో కేంద్ర ప్ర‌భుత్వం మిర్చి రైతుల‌ను ఆదుకునే ప్ర‌య‌త్నంలో ఉంది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆ క్రెడిట్ ను త‌న‌ ఖాతాలో వేసుకో వాల‌న్న ఆరాటంతో హ‌డావుడిగా గుంటూరు మిర్చి యార్డుకు ప‌రుగు తీశారు. ఆయ‌న వెళ్లి మిర్చి రైతుల‌తో మాట్లాడితే రైతులు కూడా సంతోషించేవారు. కానీ, వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను వెంట‌పెట్టుకొని ఏదో యుద్ధానికి వెళ్లిన‌ట్లు యార్డులోకి వెళ్ల‌డం.. మార్కెట్ కు స‌రుకును తీసుకొచ్చిన రైతుల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మరీ మిర్చియార్డులో నానా రభస చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  రైతులు జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   జగన్ తీరు పట్ల వైసీపీ నేతల్లోనే తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu