ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు : బీజేపీ స్టేట్ చీఫ్
posted on Aug 8, 2025 7:13PM

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు బాంబు పేల్చారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉనన్నారంటూ బీజేపీ స్టేట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరు, వారు పార్టీలో చేరే తేదీలను కూడా త్వరలో వెల్లడిస్తామన్నారు. దీంతో రాంచందర్రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. వీళ్లే కాకుండా మరింత మంది బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు.
మరోవైపు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈనెల 10న కమలం గూటికి చేరనున్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. కేసులు, సిట్‌లు, కమిషన్లు, విచారణలు, దర్యాప్తులు అంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీనికితోడు బీజేపీ కూడా అటు బీఆర్ఎస్‌పై.. ఇటు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపైనా రాంచందర్ రావు స్పందించారు. ఈ కేసును సిట్ కాకుండా సీబీఐకి అప్పగిస్తేనే వాస్తవాలు బయటికి వస్తుందని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల్లో ఓడిపోతామనే భయంతోనే..రేవంత్ రెడ్డి ఎన్నికలు నిర్వహించడం లేదని టీ బీజేపీ చీఫ్ ఆరోపించారు.