కేసీఆర్ పై కేసు వేసిన రాజలింగమూర్తి దారుణ హత్య.. రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కేసు వేసిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగ మూర్తి హత్యకు గురయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారంటూ నాగవెళ్లి రాజలింగమూర్తి గతంలో కేసు వేసిన సంగతి విదితమే. ఆ కేసు  హైకోర్టులో గురువారం (ఫిబ్రవరి 20)విచారణకు వస్తున్న తరుణంలో ఈ హత్య జరిగింది. కాగా తన భర్తను హత్య చేయించింది బీఆర్ఎస్ నేతలేనని నాగవెళ్లి రాజలింగ మూర్తి భార్య ఆరోపిస్తున్నారు. తన భర్త హత్య వెనుక బీఆర్ఎస్ నేత గండ్ర  వెంకటరమణా రెడ్డి ఉన్నారని ఆమె ఆరోపించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్​ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి(47)  బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో  దారుణ హత్య కు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.  రాజలింగమూర్తి తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో బుధవారం (ఫిబ్రవరి 19) జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి బైక్​పై భూపాలపల్లికి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వద్ద నలుగురైదుగురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజలింగమూర్తిని స్థానికులు సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించారు.  

కాగా తన భర్త హత్యకు బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్​ బుర్ర చంద్రయ్య,   మాజీ కౌన్సిలర్‌ కొత్త హరిబాబు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని రాజలింగమూర్తి భార్య సరళ డిమాండ్ చేశారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలిలో నేషనల్​ హైవేపై బుధవారం(డిసెంబర్ 19) రాత్రి  బైఠాయించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్‌ చేశారు.
కాగా రాజలింగమూర్తి హత్య ఘటనపై రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. ఈ హత్య ఎలా జరిగింది?  ఎవరు చేశారు? అన్న వివరాలను తనకు 24 గంటలలో నివేదించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu