టీటీడీ ఉద్యోగుల ఆందోళన వెనుక రాజకీయ హస్తంపై అనుమానాలు!
posted on Feb 20, 2025 11:05AM

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ సమయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. ఇందుకు టీటీడీ పాలకమండలి, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల మధ్య సమన్వయ లోపమే కారణమన్నవిమర్శలు వెల్లువెత్తాయి. ఆ వివాదం ఇంకా పూర్తిగా మరుగున పడకుండానే టీటీడీ పాలకమండలి సభ్యులు, ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం మరోసారి ప్రస్ఫుటంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక నుంచి టీటీడీ బోర్డులో సభ్యుడుగా ప్రాతినిధ్యం వహిస్తున్నసురేష్ కుమార్ సహనం కోల్పోయి ఆలయ మహద్వారా వద్ద దూషించారు. దీనిపై అధికారులు, బోర్డు పెద్దలు నోరు మెదపడం లేదు. ఈ సంఘటనపై టీటీడీ ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఉద్యోగిపై దూషణల పర్వానికి దిగిన బోర్డు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఉద్యోగులు టీటీడీ పరిపాలనా భవన్ వద్ద నిరసనకు దిగారు.
తిరుమలలో టీటీడీ ఉద్యోగిని దుర్భాషలాడి దౌర్జన్యానికి పూనుకున్న బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ను బోర్డు నుండి తొలగించి, ఆయనపై కేసు నమోదు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన బోర్డు సభ్యుడు సురేశ్ కుమార్ సంయమనం కోల్పోయి ఉద్యోగిని దూషించడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు పవిత్రమైన వెంకన్న స్వామి దేవాలయ మహాద్వారం వద్ద అమర్యాదగా ప్రవర్తించిన సురేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలి.లేకుంటే ఆయనను బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా పలు సంఘటనలు చోటు చేసుకున్నా కిమ్మనని ఉద్యోగులు ఇప్పడు ఒక బోర్డు మెంబర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన బాట పట్టడం వెనుక రాజకీయ ప్రమేయం ఉన్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ హయాంలో టీటీడీలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై అవక తవకలపై ఎన్నడూ నోరెత్తని ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఆందోళన బాటపట్టడం వెనుక ఏదో కుట్ర ఉందని అంటున్నారు. బోర్డు సభ్యుడు ఉద్యోగిపై దూషణల పర్వానికి దిగడం ఏ విధంగా చూసినా తప్పే. దీనిపై సమగ్ర విచారణ జరిపి సదరు సభ్యుడిపై చర్య తీసుకోవాలి డిమాండ్ చేయడాన్ని కూడా ఎవరూ తప్పుపట్టరు. అయితే ఏకంగా విధులు మానేసి టీటీడీ పరిపాలనా విభాగం వద్ద ధర్నాకు దిగడమే దీని వెనుక రాజకీయం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి.