వల్లభనేని వంశీకి హైకోర్టులో చుక్కెదురు
posted on Feb 20, 2025 9:44AM

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిలు కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు గురువారం (ఫిబ్రవరి 20) కొట్టివేసింది. ఇదే కేసులో ఫిర్యాదుదారుడి కిడ్నాప్ కేసులో పోలీసులు ఇప్పటికే వంశీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
వంశీని వైసీపీ అధినేత జగన్ మంగళవారం (ఫిబ్రవరి 18) పరామర్శించారు కూడా. కాగా ఆ కేసులో ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టివేయడంతో ఇప్పుడు గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కూడా వంశీని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇలా ఉండగా వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ కూడా నేడు విచారణకు రానుంది.