రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పీక్స్ కు.. బీజేపీ ప్రకటన
posted on Jul 1, 2025 9:38AM
.webp)
రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పీక్స్ కు చేరిందని బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది. పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సత్యదూరమని ఆ ప్రకటనలో పేర్కొంది. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానంటూ బీజేపీ కార్యాలయానికి వచ్చిన రాజాసింగ్ ను ఎవరూ అడ్డుకోలేదని స్పష్టం చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ అభయ్ పాటిల్ రాజాసింగ్ తో చర్చించి ఆయన కోరిక మేరకు రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి నామినేషన్ పత్రాలు ఇచ్చారనీ, అయితే పది మంది రాష్ట్ర కౌన్సిలర్ల మద్దతు ఉంటేనే నామినేషన్ సమర్పించేందుకు వీలవుతుందనీ పేర్కొన్న బీజేపీ.. అంత మంది మద్దతు లేకపోవడం వల్లే నామినేషన్ వేయకుండా రాజాసింగ్ చేతులెత్తేశారని పేర్కొంది. ఆ విషయాన్ని దాచి పెట్టి, పార్టీ పోటీ చేయనివ్వడం లేదు.. బెదిరిస్తున్నారంటూ మీడియా ముందు అవాస్తవాలు చెప్పారని బీజేపీ ఆ ప్రకటనలో విమర్శించింది. రాజాసింగ్ రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడికి పంపిస్తారని తెలిపింది.
నిజంగానే రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయదలచుకుంటే.. స్పీకర్ కే రాజీనామా పత్రాన్ని సమర్పించాలని పేర్కొంది. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదని స్పష్టం చేసింది. గతంలో కూడా పలుమార్లు క్రమశిక్షణను రాజాసింగ్ ఉల్లంఘించారనీ, ఒక సారి సస్పెండ్ కూడా అయ్యారనీ తెలిపిన బీజేపీ వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని తేల్చి చెప్పింది.