మోహిత్ రెడ్డి సన్ ఆఫ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. జైలు దారేనా?
posted on Jul 1, 2025 10:30AM
.webp)
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఇంత వరకూ 11 మందిని అరెస్టు చేశారు. ఇండోర్ లో సోమవారం (జూన్ 30) చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇద్దరు పీఏలను అరెస్టు చేసి విజయవాడకు తరలించడంతో అరెస్టుల సంఖ్య పదకొండుకు చేరింది. అతి త్వరలో ఈ సంఖ్య 12కు చేరుతుందని పరిశీలకులు అంటున్నారు. ఈ 12వ వ్యక్తి చెవిరెడ్డి మోహిత్ రెడ్డేనని విశ్లేషిస్తున్నారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏ39గా ఉన్నారు. ఆయన ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ట్రయల్ కోర్టు, ఏపీ హైకోర్టులలో పిటిషన్లు ద ాఖలు చేశారు. అయితే ఈ రెండు కోర్టులలోనూ కూడా ఆయనకు ఎదురుదెబ్బే తగిలింది. ఇటు ట్రయల్ కోర్టు, అటు హైకోర్టూ కూడా ఆయన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్లను కొట్టివేశాయి.
దీంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్టు అనివార్యమని పరిశీలకులే కాదు, న్యాయనిపుణులు కూడా అంటున్నారు. ఇలా ఉండగా లిక్కర్ కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ మోహిత్ రెడ్డికి సోమవారం (జూన్ 30) నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ మోహిత్ రెడ్డి సిట్ విచారణకు హాజరు కాకుండా గైర్హాజరయ్యారు. తాజాగా యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్లను కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఇక ఆయన విచారణకు హాజరుకాకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయన విచారణకు వస్తే విచారణ తరువాత అరెస్టు అవుతారు. లేకున్నా అరెస్టు చేస్తారు అని అంటున్నారు. తన తండ్రి చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టైన నాటి నుంచీ కూడా మోహిత్ రెడ్డి అజ్ణాతంలోనే ఉన్నారు.