కమల దళంలో కలకలం!

భారతీయ జనతా పార్టీ  రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక ఆలస్యం అయితే అయ్యింది.. ఇప్పటికైనా అంతా సవ్యంగా జరిగిందా అంటే అదీ లేదు. నిజానికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ముందుగానే తెర పైకి వచ్చింది. అయినా నామినేషన్ విషయంలో గందరగోళం నెలకొంది. ఓ వంక ఎవరైనా నామినేషన్ వేయవచ్చుని పార్టీ మాజీ అధ్యక్షుడు  బండి సంజయ్ మీడియా ముందు చెపుతున్న సమయంలోనే.. అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్  తమ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసేందుకు వచ్చిన  స్టేట్ కౌన్సిల్ సభ్యులను బెదిరించి  వెనక్కి పంపారని  ఆరోపించారు.అక్కడితో ఆగకుండా.. మీకో దండం,మీ పార్టీకో దండం  అంటూ పార్టీకి రాజీనామా  చేస్తున్నట్లు ప్రకటించారు.

నిజానికి.. రాజాసింగ్  ఇప్పుడే కాదు చాలా కాలంగా, చాలా సందర్భాలలో పార్టీ పనితీరు పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. జిల్లా అధ్యక్షుల  ఎన్నిక విషయంలో కానీ..  ఇతరత్రా పార్టీలో జరుగతున్న పరిణామాల విషయంలో కానీ  రాజాసింగ్  పార్టీ పెద్దలతో విభేదించడం కొత్త కాదు. విభేదించడం మాత్రమే కాదు.. అనేక మార్లు ఆయన  నాయకత్వం టార్గెట్ గా బహిరంగ విమర్శలు చేశారు.  ఒకటికి పదిసార్లు  ఆయన పార్టీ నాయకత్వాన్ని తప్పు పట్టారు. ఒక దశలో..  పార్టీలో పుట్టి పెరిగిన సీనియర్ నాయకులు అందరినీ మూకుమ్మడిగా బయటకు పంపితేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందనీ, పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. ముఖ్యంగా.. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  టార్గెట్ గా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలతో ఆయన  కుమ్ముక్కయ్యారని, పేరు పెట్టి మరీ ఆరోపించారు. 

నిజానికి.. ఇప్పుడు కూడా రాజాసింగ్   2014 నుంచి తాను,టెర్రరిస్ట్ థ్రెట్స్  సహా   వ్యక్తిగతంగా , కుటుంబ పరంగా అనేక కష్టనష్టాలు భరిస్తూ కూడా పార్టీ కోసం పనిచేసినా, కొందరు నాయకుల పార్టీ ఎదుగుదలను అడ్డుకున్నారని, అందుకే ఇక లాభాల లేదనే నిర్ణయానికి వచ్చి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా, రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇచ్చిన రాజాసింగ్, ఆ లేఖను అసెంబ్లీ స్పీకర్ కు పంపి, తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయమనాలని కిషన్ రెడ్డిని తాను కోరినట్లు చెప్పారు.

అదలా ఉంటే.. మరో వంక బీజేపీ నాయకులు రాజాసింగ్  రాజీనామాను అంత సీరియస్ గా  తీసుకోవలసిన అవసరం లేదని అంటున్నారు. నిజానికి పార్టీలో ప్రతి నాయకుడికి  ఏదో విషయంలో,ఎన్నోకొన్ని సమస్యలు ఉంటాయి. అలాగే.. పదవుల విషయంలో ఇతరత్రా అసంతృప్తి  ఉంటుంది. అయినా.. సర్దుకు పోవాలి, కాదంటే, పార్టీ సమావేశాల్లో నాయకత్వ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిచుకోవాలి కానీ, ఇలా అయిన దానికి  కాని దానికి, చీటికి మాటికీ మీడియాకు ఎక్కడం మచిది కాదని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

నిజంగా రాజాసింగ్  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ దల్చుకుంటే నేరుగా స్పీకర్ కే రాజీనామా లేఖ సంర్పించాలని బీజేపీ నాయకులు అంటున్నారు. మరోవంక రాజాసింగ్ కు ప్రజల్లో ఉన్న మద్దతు దృష్ట్యా ఇంతవరకు చూసీ చూడనట్లు ఉన్నా..  ఇకపై తీవ్ర చర్యలు తపప్క పోవచ్చని అంటున్నారు. అయితే..  రాజాసింగ్   ఎపిసోడ్ చివరకు ఏ మలుపు తిరుగుతుంది?  అనేది చూడవలసి ఉంటుందని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu