వ‌రిపై తెలుగులో రాహుల్ ట్వీట్‌.. క‌విత కౌంట‌ర్‌.. రేవంత్ సెటైర్‌..

తెలంగాణలో జరుగుతున్న‌ వ‌రి రాజ‌కీయంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. తెలుగులో ట్వీట్ చేశారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటని విమ‌ర్శించారు.

రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలని డిమాండ్ చేశారు రాహుల్‌గాంధీ. తెలంగాణలో రైతుల చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ట్విట్ట‌ర్ వేదిక‌గా భ‌రోసా ఇచ్చారు. 

రాహుల్‌గాంధీ ట్వీట్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్పందించారు. తెలంగాణ రైతుల ఆవేదనను అర్థం చేసుకుని ఉద్యమ కార్యచరణకు మద్ధతుగా నిలిచిన రాహుల్ గాంధీకి ట్విట్ట‌ర్‌లో ధన్యవాదాలు చెప్పారు రేవంత్‌.

రాహుల్‌గాంధీ రియాక్ష‌న్స్ చూస్తుంటే.. తెలంగాణ వ‌రి రాజ‌కీయం ఢిల్లీ స్థాయిలో ప్రాధాన్య‌త సంత‌రించుకుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ టీఆర్ఎస్‌- బీజేపీల మ‌ధ్యే జ‌రుగుతున్న ఈ వ‌రి వార్‌లో.. ఇన్నాళ్లూ కాంగ్రెస్ కాస్త వెన‌క‌బ‌డిన‌ట్టే అనిపించింది. ఇప్పుడిక ఏకంగా రాహుల్‌గాంధీనే స్పందించ‌డంతో.. వ‌రి పోరులో మేముసైత‌మంటూ హ‌స్తం పార్టీ చెయ్యి పెట్ట‌నుంది. రేవంత్‌రెడ్డి ఎంట‌రైతే.. పాడీ ఫైర్ ఇక ఓ రేంజ్‌లో సాగ‌నుంది. 

ఇక‌, రాహుల్‌గాంధీ ట్వీట్‌పై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. ‘‘మీరు ఎంపిగా ఉండి రాజకీయ లబ్ది కోసం ట్విట్టర్‌లో సంఘీభావం తెలపడం కాదు.. మీకు నిజాయతీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్‌లోకి వచ్చి నిరసన తెలపండి. ఒకే దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి. ధాన్యం కొనుగోలుపై పంజాబ్, హర్యానాకు ఒక నీతి.. ఇతర రాష్ట్రాలకు ఒక నీతి ఉంది’’ అంటూ కవిత ట్వీట్ చేశారు. 

క‌విత ట్వీట్‌పై రేవంత్‌రెడ్డి ట్విట్ట‌ర్లో సెటైర్ వేశారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడటం లేదని… సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని కామెంట్ చేశారు. ‘‘ఇకపై ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ తండ్రి కేసీఆర్ గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారు. మీ తండ్రి నాడు చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైంది. ఈ వాస్తవాన్ని మీరు మర్చిపోయారు’’ అంటూ రేవంత్ రెడ్డి క‌విత‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఇలా వ‌రిపై ట్వీట్ వార్ హ‌ట్ హాట్‌గా సాగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu