బీపీ ఇప్పుడే వ‌చ్చిందా? కోడిక‌త్తి దాడి జ‌రిగితే ఏమ‌య్యారు? జ‌గ‌న్‌పై ర‌ఘురామ సెటైర్లు..

టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు జ‌ర‌గ‌డం దారుణ‌మైతే.. దాడి చేసిన వారిని స‌మ‌ర్థిస్తూ సీఎం జ‌గ‌న్ మాట్లాడ‌టం అంత‌కన్నా దారుణం అంటున్నారు. ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి దాడుల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్టు మాట్లాడటాన్ని అంతా త‌ప్పుబ‌డుతున్నారు. త‌న‌ను తిడితే.. త‌న మీద ప్రేమ ఉన్న అభిమానుల‌కు బీపీ వ‌చ్చి అలా ఎదురుతిరిగారంటూ వైసీపీ రౌడీల‌ను సీఎం వెన‌కేసుకు రావ‌డం.. ప్ర‌భుత్వ ప్రేరేపిత ఉగ్ర‌వాద‌మే అంటున్నారు. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతుండ‌గా.. తాజాగా వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు సైతం స్పందించారు.

‘‘బీపీలు పెరిగితే దాడులు చేస్తారని సీఎం మాట్లాడడమేంటి? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి జగన్‌ ఇలా మాట్లాడతారా? వైసీపీ నేతలు బూతులు మాట్లాడటం లేదా? గతంలో వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు జగన్‌కు గుర్తులేవా? మిమ్మల్ని అనని మాటలకే మీ అత్యుత్సాహకులకు బీపీలు పెరిగిపోతే.. మీపై కోడికత్తి దాడి జరిగినప్పుడు మీ అత్యుత్సాహకులు ఏమయ్యారు?’’ అంటూ ప్ర‌శ్నించారు ఎంపీ ర‌ఘురామ‌.

కొందరు అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారంటూ ప‌రోక్షంగా డీజీపీపై మండిప‌డ్డారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు మారేందుకు ప్రయత్నించాలంటూ హిత‌వు ప‌లికారు. బోసిడీకే పదానికి వైసీపీ అధికార వెబ్‌సైట్‌లో కొత్త పదాన్ని సృష్టించారని.. అద‌స‌లు తిట్టే కాద‌ని.. గూగుల్‌లో వెతికితే.. మీరు బాగున్నారా.. అనే అర్థం వ‌స్తోంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.