ఆ అనుమానాస్ప‌ద వ్య‌క్తి అత‌నే.. దాడుల‌పై సీబీఐ విచారణకు డిమాండ్‌..

అంతా సినిమాటిక్‌గా సాగిపోయింది. కార్లు ర‌య్‌మంటూ రావ‌డం.. కారుతో టీడీపీ ఆఫీసు గేటును గుద్ద‌డం.. గేటు విర‌గొట్టి లోనికి చొచ్చుకెళ్ల‌డం.. వ‌స్తూ వ‌స్తూ రాడ్లు, క‌ర్ర‌లు, సుత్తి తీసుకురావ‌డం.. అంతా ప్రీ ప్లాన్డ్ ప‌క్కా స్కెచ్‌తో చేసిన దాడుల‌ని ఇప్ప‌టికే తేలిపోయింది. ఇదంతా తాడేప‌ల్లి ప్యాలెస్ డైరెక్ష‌న్‌లోనే జ‌రిగింద‌ని టీడీపీ మండిప‌డుతోంది. అయితే, మంగ‌ళ‌గిరి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆ అనూహ్య ఘ‌ట‌న జ‌రిగింది. టీడీపీ ఆఫీసులో ఓ అనుమానాస్ప‌ద వ్య‌క్తిగి పార్టీ వ‌ర్గాలు ప‌ట్టుకున్నాయి. అత‌డిని ప్ర‌శ్నిస్తే డీజీపీ కార్యాల‌య సిబ్బంద‌ని తేలింది. అంటే, చంద్ర‌బాబు అన్న‌ట్టు.. ఇది ప్ర‌భుత్వ-పోలీస్ ప్రేరేపిత ఉగ్ర‌వాద‌మేగా..! అంటున్నారు. అందుకే, దాడి ఘ‌ట‌న వెనుకున్న కుట్ర అంతా బ‌య‌ట‌కు రావాలంటే సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని టీడీపీ సీనియ‌ర్ నేత ప‌య్యావుల కేశ‌వ్ డిమాండ్ చేస్తున్నారు.  

టీడీపీ కార్యాలయంలో అనుమానాస్పద వ్యక్తిని పట్టుకున్నామని.. ఆరా తీస్తే అతడిని డీజీపీ కార్యాలయంలో పీఆర్వోగా గుర్తించామని ప‌య్యావుల తెలిపారు. టీడీపీ ఆఫీసులోని సీసీ కెమెరాల్లో అన్నీ రికార్డయ్యాయని చెప్పారు. ఈ దాడికి సూత్రధారులు, పాత్రదారులు ఎవ‌రో తెలియాలంటే సీబీఐ విచారణ జరిపించాలని అన్నారు. డీజీపీ పాత్రపైనా విచారణ జరిపించాలని పయ్యావుల డిమాండ్‌ చేశారు. 

దాడి ఘటనలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని.. అన్ని విషయాలూ తేలుస్తామని హెచ్చ‌రించారు. కొంతమంది వల్ల పోలీసు వ్యవస్థ అంతర్మథనంతో నలిగిపోయే పరిస్థితి నెలకొందన్నారు. అధికారం ఉందని దాడులకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప‌య్యావుల కేశ‌వ్‌. గంజాయిపై ప్రశ్నిస్తే దాడులా? అని నిలదీశారు. ఇలాంటి దాడుల‌కు భయపడేది లేదని మండిప‌డ్డారు.