ఇంటికో ఓటు.. రేవంత్‌రెడ్డి పిలుపు.. కాంగ్రెస్ దూకుడు..

అంతా అంటున్నారు హుజురాబాద్ రేసులో కాంగ్రెస్ లేద‌ని. పోటీ టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య‌నే కొన‌సాగుతోంద‌ని. కానీ, తామూ బ‌రిలోనే ఉన్నామంటూ.. చెయ్యెత్తి పిడికిలి బిగిస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఇప్ప‌టికే కాంగ్రెస్ త‌ర‌ఫున యువ‌జ‌న నాయ‌కుడిని నిల‌బెట్టి.. శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఓవైపు వెంక‌ట్ ప్ర‌చారంలో దూసుకుపోతుండ‌గా.. తెర‌వెనుక గెలుపు వ్యూహాలు ర‌చించే ప‌నిలో బిజీగా ఉన్నారు రేవంత్‌రెడ్డి. 

తాజాగా, హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ‘ఇంటికో ఓటు కాంగ్రెస్‌కు’ అనే నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువత, విద్యార్థులు, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం ఉండాలని సూచించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలో ప్రజలకు వివరించాలన్నారు. 

వ‌చ్చే వారం రోజుల పాటు అమ‌లు చేయాల్సిన ప్రచార వ్యూహాలపై పార్టీ హుజురాబాద్‌ ఇంఛార్జిల‌తో చర్చించారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడు, విద్యార్థి నేతకు టికెట్‌ ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని యువతలోకి తీసుకు వెళ్లాలని సూచించారు. టీఆర్ఎస్‌, బీజేపీల మోసపూరిత విధానాలు, ఇచ్చి నెర‌వేర్చ‌ని వాగ్దానాలను ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా వివరించాలని అన్నారు. కారు, క‌మ‌లం పార్టీల‌ లోపాయికారి ఒప్పందాలు, చీకటి రాజకీయాలను బయట పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.