రథసప్తమి వేడుకలు
posted on Feb 19, 2021 10:27AM
అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి చేతుల మీదుగా వేడుకలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ లతో కలిసి తొలి దర్శనం చేసుకున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠం తరపున సూర్యనారాయణస్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. రథసప్తమి రోజున సూర్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా బారులు తీరారు. స్వామి వారి నిజ రూప దర్శనంతో తరించారు.
అటు.. తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి వారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహనంతో మొదలై, చంద్రప్రభ వాహనంతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, 9 గంటల నుంచి 10 వరకు చిన్నశేష వాహనం, 11 నుంచి 12 వరకు గరుడ వాహనంపై స్వామి వారు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామి వారు దర్శనమివ్వనున్నారు.