ప్రోత్సహిస్తే పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు: పి.వి.సింధు
posted on Nov 14, 2014 2:16PM

తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారని భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు అన్నారు. తాను చెప్పిన మాటకు ప్రత్యక్ష ఉదాహరణ తానేనని ఆమె అన్నారు. ఎన్నో అంతర్జాతీయ టోర్నమెంట్స్‌లో పాల్గొని విజయాలు సాధించిన పి.వి.సింధు తెలుగువారి ఆత్మీయ వారధి తెలుగువన్ రేడియో (టోరి) లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న పి.వి.సింధు ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారితో తన మనసులోని మాటలను పంచుకున్నారు. తాను తనకు ఎనిమిదేళ్ళ వయసు ఉన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్ మీద ఆసక్తి చూపించానని, అయితే తన తల్లిదండ్రులు ఇద్దరూ వాలీబాల్ క్రీడాకారులని, తన తండ్రి వాలీబాల్ క్రీడ ద్వారా అర్జున అవార్డు కూడా గెలుచుకున్నారని ఆమె చెప్పారు. తన తల్లిదండ్రులు వాలీబాల్ క్రీడాకారులు కాబట్టి తనను కూడా వాలీబాల్ క్రీడాకారిణిని చేయాలని చూడకుండా, తనకు ఇష్టమైన బ్మాడ్మింటన్ క్రీడలోనే తనను ప్రోత్సహించారని ఆమె చెప్పారు.
‘‘ఎంతోమంది నా తల్లిదండ్రులకు నన్ను కూడా వాలీబాల్ క్రీడాకారిణిని చేయండని సూచనలు ఇచ్చారు. అయితే నా తల్లిదండ్రులు మాత్రం వాటిని ఎంతమాత్రం పట్టించుకోలేదు. నాకు ఇష్టమైన బ్యాడ్మింటన్ ఆడే విధంగానే నన్ను ప్రోత్సహించారు’’ అని సింధు అన్నారు. తనకోసం ఎన్నో త్యాగాలు చేసిన తన తల్లిదండ్రులకు తాను ఎంతో రుణపడి వున్నానని ఆమె చెప్పారు. తాను ఇంత పెద్ద క్రీడాకారిణిని అవుతానని ఊహించలేదని, తాను మొదట్లో అనేక సందర్భాల్లో ఓడిపోయానని, అయినప్పటికీ తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో విజేతగా నిలిచానని పి.వి. సింధు చెప్పారు. ఈ రేడియో లైవ్ షోకి ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేకమంది తెలుగువారు ఫోన్ చేసి సింధుతో మాట్లాడారు. తెలుగుతేజం పి.వి.సింధు భవిష్యత్తులో మరెన్నో విజయాలు అందుకోవాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. టోరికి వచ్చినందుకు పి.వి. సింధు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. పి.వి.సింధు టోరి కార్యాలయానికి వచ్చినప్పుడు తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ రవిశంకర్ కంఠంనేని ఆమెకు పుష్పగుచ్ఛంతో సాదర స్వాగతం పలికారు.
సింధు మరిన్ని ఫొటోల కోసం http://goo.gl/Shoh8a