ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారు? కొడాలి క‌న్వెన్ష‌న్‌పై చ‌ర్య‌లెందుకు తీసుకోరు?

ఏపీలో అసలు ఏమి జరుగుతోంది? పోలీసు వ్యవస్థ అనేది వుందా? పనిచేస్తోందా? అనే అనుమానాలు సామాన్య ప్రజలను కలవర పాటుకు గురిచేస్తున్నాయి. సంక్రాంతి పండగ సందర్భంగా గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన క్యాసినోలో మందు మొదలు జూదం వరకు అసాంఘిక కార్యకలాపాలు అన్నీ సర్కార్ కనుసన్నల్లో చక్కగా సాగిపోయాయి. ఈ విషయంలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. క్యాసినోలో అశ్లీల నృత్యాలు చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.

కె కన్వెషన్ లో పండగ పూట జరిగిన మందు, మగువ, జూదం, అసభ్య నృత్యాల ద్వారా రూ.500 కోట్లు చేతులు మారాయని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. నిజానికి, టీడీపీ నాయకులు రాజకీయ విమర్శచేసి వదిలేయలేదు. ఈ మేరకు పోలీసులకు  ఫిర్యాదు చేశారు.  అయినా. పోలీసులు మాత్రం ఇంత వరకూ అటు వైపు కన్నెత్తి చూడలేదు. 

తెలుగు సంస్కృతిని తెగనార్చే విధంగా ఇప్పటికే జగన్ ప్రభుత్వం మాతృ బాషకు మంగళం పాడే చర్యలను ప్రారంభించింది. ప్రాధమిక స్థాయిలోనే  ఇంగ్లీష్ మీడియం అంటూ హడావిడి  చేస్తోంది. ఇక ఇప్పుడు గోవా నుంచి  క్యాసినో కల్చర్’ ను, మంత్రి కొడాలి నానీ ఏపీకి తీసుకొచ్చారు.అక్కడ జరిగిన జరుగుతున్న అకృత్యాలు, అసాంఘిక కార్యకలపాలకు సంబందించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినా  పోలీసులు మాత్రం అవి కనిపించ్ధమే లేదు. అసలు ఏమీ  జరగనట్లు చూస్తున్నారు. ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ఇదేం పోలీసింగ్ అని నివ్వెర పోతున్నారు. 

ఓ వంక రాష్ట్రంలో పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి. రాజకీయ రౌడీయిజం రాజ్యమేలుతోంది. అయినా పోలీసు యంత్రాంగం అధికార పార్టీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చేతిలో కీలు బొమ్మలా పనిచేస్తోందే,గానీ, సామాన్య ప్రజలకు రక్షణ కలిపించలేక పోతోందనే భావన రోజురోజుకు బల పడుతోంది.    

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు పూర్తయింది. ఈ 32 నెలల్లోనే, అధికార పార్టీ అండదండలతో 33 మంది తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హత్యకు  గురయ్యారు. అయినా ఇంత వరకు ఒక్కరంటే ఒక్కరిని అయినా పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఒక్కరిపైనా పక్కా కేసు బుక్ చేయ లేదని తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక దాడులు దౌర్జన్యాల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్లు,పార్టీ కార్యాలయాల పై దాడులు జరుగుతున్నాయి. అంతమాత్రమే కాదు దేవుళ్లను, దేవాలయను కూడా దుండగులు వదిలి పెట్టడం లేదు. అయినా పోలీసులు కళ్ళు తెరవడం లేదు. అదేమంటే అది పిచ్చోడి పని ఇది బీపీ రోగుల పని,అంటూ నేరస్తులను పోలీసులే వెనకేసు కొస్తున్నారు. 

మరోవంక అరాచక కార్యకలాపాలకు రాష్ట్రం అడ్డాగా మారుతోంది. దేశంలో ఎక్కడనుంచి ఎక్కడికి  గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరిగినా దాని మూలాలు ఏపీలోనే తేలుతున్నాయి. గడచిన మూడేళ్లలో రాష్ట్రంలో దొరికిన గంజాయి పరిమాణం మూడు రెట్లు పెరిగింది. ఇది, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణ కాదు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్’కు ఇచ్చిన సమాధానం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో  తెలుగు దేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు  మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయం చెప్పారు. 

ఇలా ఏ కోణంలో చూసినా రాష్ట్రంలో శాంతిభద్రతలుపూర్తిగా అదుపు తప్పాయి. అసాంఘిక కార్యకలాపాలు జోరందుకున్నాయి. పల్లె పట్టణంఅన్న తేడా లేకుండా, వైసేపీ నాయకుల కనుసంనాల్లో పోలీసు యంత్రాంగం పనిచేస్తోందంటే కాదనే పరిస్థితి లేదని  అంటున్నారు సామాన్యులు. నిజమే కావచ్చును, పోలీసు బాసుల ఆదేశాల మేరకే క్రింది స్థాయి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. అధికార పార్టీ నేతలు హత్యలు చేసినా… అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా పోలీసులు కనీసం కన్నెత్తి చూడరనే విమర్శలు వెళ్ళు వెత్తుతున్నాయి. ఇదే పరిస్థతి ఇలాగే కొనసాగితే పోలీసు వ్యవస్థ తీరుపై ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని సామాన్యులు హెచ్చరిస్తున్నారు.