ఏపీ అప్పులపై కేంద్రం కన్నెర్ర!.. బుగ్గన ఢిల్లీ మకాం అందుకేనా?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంచుమించుగా చాలా రోజులకు ఢిల్లీలో ఉన్నారు. అఫ్కోర్స్, ఆయన ఇలా ఢిల్లీలో ఉండిపోవడం కొత్త విషయం కాదు. నిజానికి, ఆయన రాష్ట్రంలో కంటే ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటారని, అంటారు. ఎందుకుంటారు, ఏమి చేస్తారు అనేది, వేరే విషయం. అదలా ఉంచితే, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య పీఆర్సీ జగడం నడుస్తోంది. పీఆర్సీను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల సాధన సమితి ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇచ్చేందుకు నిర్ణయించింది. మరో వంక, ఉద్యోగులతో సంప్రదిపులు జరిపేందుకు ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించింది. ఈ కమిటీలో మంత్రి బుగ్గన సభ్యులు. అదీ గాక ఆర్థిక అంశాలతో ముదిపడిన చర్చలలో ఆర్థిక మంత్రిగా ఆయన పాత్ర కీలకం. అయినా ఆయన ఢిల్లీ వదిలి రావడం లేదు. ఆవిషయాన్ని జేఎడీ అధికారులే చెప్పారు. పీఆర్సీ జీవోలు వెనెక్కి తీసుకునేవరకు చర్చలకు వచ్చేది లేదని  స్టీరింగ్ కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు,అనుకోండి అది వేరే విషయం. అయినా ఇలాంటి కీలక సమయంలో ఆర్థిక మంత్రి ఎందుకు ఢిల్లీలో తిష్ట వేశారు? ఎందుకు ఢిల్లీ వదిలి రావడం లేదు?అనే విషయంలో ఆసక్తికర్ చర్చ జరుగుతోంది. 

ఇందుకు ఇంకా కారణాలు ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరుపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేయడం ఒక ప్రధాన కారణం అంటున్నారు. అంతే కాదు ఇంత వరకు చూసినట్లు వ్యవహరిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపకరిస్తోందని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టా రాజ్యంగా చేస్తున్న అప్పుల కట్టడికీ కేంద్రం నడుబిగించిందని, అందుకే బుగ్గన ఢిల్లీలో తిష్ట వేసి కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచరం. 

అదలా ఉంటే,  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే సుజనా చౌదరి వంటి బీజేపీ జాతీయ నాయకులు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందనీ, చర్యలు తప్పవని చెపుతూనే వున్నారు.  ఈ నేపధ్యంలోనే విదేశీ ఆర్థిక సంస్థల నుంచి వచ్చే నిధుల వినియోగంపై కేంద్ర ఆర్థిక రాష్ట్రానికి షాక్ ఇచ్చింది. ఏఐఐబీ, ఎన్‌డీబీ నుంచి మంజూరైన రుణాలకు అడ్వాన్స్‌లు ఇప్పించాలని కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ  ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం రాసిన లేఖపై కేంద్ర శాఖలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఏఐఐబీ నుంచి అడ్వాన్స్‌ రూపంలో ఇచ్చిన రూ.500 కోట్లకు ముందు లెక్క చెప్పాలని కేంద్రం కోరింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నిధులు జమచేయకుండా, విదేశీ ఆర్థిక సంస్థలు నిధులు ఎలా ఇస్తామని కేంద్రం ప్రశ్నించింది. ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్‌ల వినియోగానికి లెక్కలు పంపాలని ఆదేశించింది. ప్రాజెక్ట్‌ ఇంప్లిమెంట్‌ అథారిటీకి ప్రభుత్వంలోని నిధులను బదిలీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చింది. మరో వంక కేంద్ర ఆర్థికశాఖ విధించిన షరతులతో దాదాపుగా రూ.8 వేల కోట్ల రుణం మంజూరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను అమలు చేస్తేనే నిధులు విడుదల అవుతాయని డిపార్టుమెంట్ ఆఫ్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడ్వాన్స్‌లు ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది.

అలాగే, రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చేసన అప్పులపై కూడా కేంద్రం దృష్టిని కేద్రీకరించింది, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అప్పులపైనే అధారాపడిన రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు.. అందుకే రాష్ట్ర ఆర్థిక మంత్రి ఢిల్లీ వదలడం లేదని, ఆర్థిక శాఖ వర్గాల సమాచారంగా ప్రచార మవుతోంది.అంతే కాదు కేంద్రం కన్నేసిందే నిజం అయితే, ఏపీ సరకార్ కు ఇక అప్పులు పుట్టడం కష్టమే అంటున్నారు. ఏమవుతుందో ... ఈ సంక్షోభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎలా బయట పడుతుందో చూడవలసిందే అంటున్నారు.