నోట్లో యాసిడ్ పోసి.. వివ‌స్త్ర‌ను చేసి క‌ట్టేసి.. భార్య‌పై ఉన్న‌తోద్యోగి టార్చ‌ర్‌..

ఆమె చెప్పిందాని ప్ర‌కారం.. అత‌డు మ‌నిషి కాదు ఉన్మాది. భ‌ర్త‌ ముసుగులో ఉన్న రాక్ష‌సుడు. చేసేది నీటిపారుద‌ల శాఖ‌లో సూప‌రింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ). అంత పెద్ద జాబ్ ఉన్నా.. స‌మాజంలో హోదా ఉన్నా.. భార్య విష‌యంలో మాత్రం పోరంబోకులానే ప్ర‌వ‌ర్తించాడు. ఆస్తి కోసం ఆమెను నానాటార్చ‌ర్ పెట్టాడు. న‌ర‌కం చూపించాడు. వేధింపులు ప‌డ‌లేక‌.. మీడియా ముందుకు వ‌చ్చి గోడు వెళ్ల‌బోసుకుంది మాజీ బ్యాంక్ ఉద్యోగి అయిన‌ ఆ భార్య‌. భర్త నుంచి ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని పోలీసులను వేడుకుంది.

నోట్లో యాసిడ్‌ పోసి హత్యాయత్నం చేశాడు. వివస్త్రను చేసి కొన్ని రోజుల పాటు ఓ గదిలో నిర్బంధించాడు! ఏసీబీ స్వాధీనం చేసుకొని, తిరిగిచ్చేసిన ఆస్తులను తన పేరిట బదిలీ చేయాలని వేధించాడు!.. ‘నాకు ఆస్తులొద్దు.. ఏమీ వద్దు ప్రాణాలతో ఉంటే చాలు’ అంటూ భ‌ర్త చేసిన టార్చ‌ర్ గురించి చెబుతోంది.  

బాధితురాలి పేరు బోడ పద్మజ (47). ఆమె భర్త కొర్ర ధర్మానాయక్‌. 1989లో వారి వివాహం జరిగింది. ధర్మానాయక్‌.. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఎస్‌ఈగా ఉన్నారు. సైదాబాద్‌ సరస్వతీనగర్‌లో నివాసముంటున్నారు. 2008లో ఏఈగా పనిచేస్తున్న కాలంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో సైదాబాద్‌లోని వీరి ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. పలు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచే పద్మజపై ధర్మానాయక్‌ వేధింపులు మొదలయ్యాయి. ఆమె చేస్తున్న బ్యాంకు ఉద్యోగానికి కూడా రాజీనామా చేయించాడు. ఆస్తులను తన పేరిట బ‌దిలీ చేయాలని భర్త వేధింపులకు గురిచేస్తున్నారంటూ సైదాబాద్‌ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ధర్మానాయక్‌పై పోలీసులు 498ఏ కేసు నమోదు చేయగా, కుటుంబ పెద్దల జోక్యంతో రాజీ కుదిరింది. అయితే కొన్ని నెలల తర్వాత ఆమెకు భర్త నుంచి మళ్లీ వేధింపులు మొదలయ్యాయి. 

భ‌ర్త ధ‌ర్మానాయ‌క్ హింసలకు తాళలేక ఆమె ఈ నెల 2న ఇంట్లో నుంచి వెళ్లిపోయి కొత్తపేటలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. 4వ తేదీన ఆమె ఇంటికి  ధర్మానాయక్‌.. తల్లి లక్ష్మీబాయి, తమ్ముడు నాగరాజు, చిన్నమ్మ కాంత వ‌చ్చారు. పద్మజను బలవంతంగా కారులో ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఆమె, తన ఫోన్‌ నుంచి షీ టీం, సైదాబాద్‌ పోలీసులకు మేసేజ్‌ పెట్టింది. దీన్ని గమనించి ఆ ఫోన్‌ను ధ్వంసం చేశారు. 

ప‌ద్మ‌జ‌ను సరస్వతీనగర్‌లోని ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా సూసైడ్‌ నోటు రాయించారు. నోట్లో యాసిడ్‌ పోశారు. పద్మజ గట్టిగా కేకలు వేయడంతో భ‌య‌ప‌డి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆస్పత్రిలో ఆమెకు నాలుగు సర్జరీలు జరిగాయి. ఇంటి నుంచి బయటకు వస్తే వారి బండారం బయటపడుతుందనే భయంతో ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిన త‌ర్వాత‌ ఆమెను ఓ గదిలో వివస్త్రను చేసి బంధించారు. ఎలాగోలా అతికష్టం మీద ఆమె తప్పించుకొంది. ఇవ‌న్నీ ప‌ద్మ‌జ చేస్తున్న ఆరోప‌ణ‌లు.

మ‌రోవైపు, పద్మజ శనివారం ఇంట్లోంచి వెళ్లిపోవడంతో తన భార్య కనిపించడం లేదంటూ ధర్మనాయక్‌, సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పైగా 50 తులాల బంగారు నగలు, రూ.50 వేల నగదును ఆమె తీసుకువెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. 

పద్మజ, ఆమె తల్లి, తమ్ముడు, ఇతర కుటుంబసభ్యులతో ఉన్న గొడవల కారణంగా మానసికంగా ఇబ్బందులు పడుతోందని.. తనను అన్యాయంగా ఇరికిస్తున్నారని ఎస్‌ఈ ధర్మానాయక్ అంటున్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి విచారణకైనా  సిద్ధమని చెప్పారు.