బెంగాల్ లో బీజేపీకి 10 సీట్ల లోపే! రాజకీయాల నుంచి తప్పుకుంటానని పీకే సవాల్
posted on Dec 21, 2020 4:36PM
దేశ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే బెంగాల్ లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. హ్యాట్రిక్ కొట్టేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తహతహలాడుతుండగా.. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తనదైన శైలిలో బెంగాల్ రాజకీయాలను మలుపు తిప్పుతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కమలనాధుల ఆకర్ష్ మంత్రానికి టీఎంసీ షేకవుతోంది. ఇటీవలే 8 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. టీఎంసీలో కీలక నేతగా ఉన్న సేవెందు అధికారి కూడా బీజేపీలో చేరారు. ఎన్నికల నాటికి బెంగాల్ లో మరిన్ని సంచలనాలు ఉంటాయని, టీఎంసీలో మమత ఒక్కరే మిగిలిపోతారని కామెంట్ చేశారు అమిత్ షా. బీజేపీ నేతల తీరుపై టీఎంసీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
బెంగాల్ లో బీజేపీ దూకుడుగా ఉండగా... ఆ పార్టీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఎన్ని ఎత్తులు వేసినా బెంగాల్ లో బీజేపీ పది సీట్లు కూడా గెలుచుకోలేదని అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రశాంత్ కిషోర్.. మళ్లీ మమతా బెనర్జీనే విజయం సాధిస్తారని చెప్పారు. అంతేకాదు బెంగాల్‌లో బీజేపీకి డబుల్ డిజిట్ కంటే ఎక్కువ సీట్లు వస్తే.. తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు పీకే. 2014 ఎన్నికల నుంచి ప్రశాంత్ కిషోర్ అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు బెంగాల్ తో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.