దిశ వాహనాలకు వైసీపీ రంగులు! గుంటూరు పోలీసుల అత్యుత్సాహం
posted on Dec 22, 2020 9:34AM
కోర్టులు చివాట్లు పెట్టినా.. ప్రజలు ఛీదరించుకుంటున్న ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి రంగుల పిచ్చి పోవడం లేదు. వైసీపీ నేతలే కాదు ప్రభుత్వ అధికారులది అదే తీరు. ఎవరేం అనుకుంటే మాకేందన్నట్లుగా అవే తప్పులు చేస్తూనే ఉన్నారు. తాజాగా గుంటూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన మన్ననలు పొందాలనే ఆశతోనే ఏమో.. పోలీస్ వాహనాలకూ వైసీపీ రంగులేశారు. దిశ వాహనాలకే కాకుండా, గతంలో కేంద్ర ప్రభుత్వం ‘శక్తి’ పేరుతో ప్రతి స్టేషన్‌కూ మహిళా ఎస్‌ఐలకు కేటాయించిన బైక్‌లకూ వైసీపీ స్టిక్కర్లు అంటించి దిశ పేరుతో ప్రారంభించారు.గుంటూరులోని పోలీస్ కార్యాలయంలో అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఈ వాహనాలను జెండా ఊపి అట్టహాసంగా ప్రారంభించారు. పాతవి కావడంతో రెండు వాహనాలు మొరాయించాయి
గతంలోనూ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఏకంగా మహిళల రక్షణ కోసం అంటూ ప్రారంభించిన దిశ యాప్‌కు వైసీపీ రంగులే వేశారు. అది వివాదం కావడంతో తిరిగి తొలగించారు. గతంలో రంగుల విషయంలో పెద్ద వివాదం జరిగినా.. గుంటూరు పోలీసులు దిశ వాహనాలకు వైసీపీ రంగులేయడం వివాదాస్పదమవుతోంది. సీఎం పుట్టిన రోజు కానుక అన్నట్లుగా గుంటూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు కోట్ల రూపాయలు వెచ్చించి వైసీపీ రంగులేయడం.. కోర్టులు తప్పు పట్టడం జరిగింది. కోర్టు చివాట్లు పెట్టడంతో ఆయా రంగులను మార్చేశారు. అప్పట్లో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ‘దిశ’ స్టేషన్‌లకు కూడా వైసీపీ రంగులు వేయగా కోర్టు ఆదేశాలతో వాటిని కూడా మార్చారు.