కాంగ్రెస్ తరఫున ప్రశాంత్ కిషోర్ వ్యూహం?

ఎన్నికల వ్యూహకర్తగా ప్రసిద్ధి చెందిన ప్రశాంత్ కిషోర్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీతో జతకట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని పాలిటిక్స్ పండితులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం  కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో విడివిడిగా, ఆ తర్వాత ఇద్దరితో కలిసి భేటీ అవడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అయితే.. రాహుల్, ప్రియాంకతో తన సమావేశం ఊహాగానమే తప్ప వాస్తవం కాదని ప్రశాంత్ కిషోర్ చెప్పినప్పటికీ.. పీకే భేటీ ముమ్మాటికీ నిజమే అని కాంగ్రెస్ పార్టీలో కొందరు ముఖ్య నేతలు ధ్రువీకరిస్తుండడం గమనార్హం. వచ్చే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పీకే ఎన్నికల వ్యూహాలు రచిస్తారని కూడా ఆ నేతలు చెబుతుండడం విశేషం. కాగా.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాలను ప్రశాంత్ కిషోర్ ఒకప్పటి సహచరుడు సునీల్ కనుగోలు చూస్తున్నారు.  

వచ్చే సంవత్సరం గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పనిచేసే బాధ్యతను పీకేకు అప్పగిస్తారని కాంగ్రరెస్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ- ప్రశాంత్ కిషోర్ కలిసిన పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే అభిప్రాయం కాంగ్రెస్ అధిష్టానంలో ఉందని తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్రంలోని బీజేపీని ఢీకొట్టే జాతీయ కూటమి ఏర్పాటు దిశగా రాహుల్, ప్రియాంక- ప్రశాంత్ కిషోర్ సమావేశాలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతుండడం గమనార్హం. వివిధ రాష్ట్రాల్లో పార్టీని పునరుద్ధరించే బాధత్య పీకేకి అప్పగిస్తే.. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్ ఉందనే చర్చ గతంలోనే జరిగింది. పీకేను పార్టీలో చేర్చుకుని ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించాలనే సమాలోచనలు జరిగాయట.

నిజానికి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమిని మూటకట్టుకుంది. ఒకప్పడు గాంధీల కుటుంబానికి కంచుకోట, పెద్ద రాష్ట్రమైన యూపీలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడిపోయింది. దీంతో ఎలాగైనా కాంగ్రెస్ ను బతికించుకోవాలనే వ్యూహంలో భాగంగానే అధినేత్రి సోనియా సూచన మేరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారనే ఊహాగానాలు వస్తున్నాయి. నిజానికి గతంలో కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ సుముఖత వ్యక్తం చేశారు. అయితే.. అప్పుడు రాహుల్ గాంధీ ససేమిరా అన్నారు. యితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యేందుకు రాహుల్ దిగివచ్చినట్లు చెబుతున్నారు.

సోనియా గాంధీకి అత్యంత సమీపంగా మెలిగే రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి అన్నింటినీ సమన్వయ పరిచి చక్కదిద్దే నాయకుడు లేడనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి బాధ్యతను ప్రశాంత్ కిషోర్ కు అప్పగిస్తే మంచిదని కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం భావిస్తోందట. వ్యూహకర్తగా బాధ్యతలు తీసుకోక ముందే క్షేత్ర స్థాయిలో పర్యటించి, అన్ని విషయాలు కూలంకషంగా అధ్యయనం చేయడం పీకే స్టైల్. ఇలాంటి శైలి కారణంగా పీకేకి కాంగ్రెస్ ఎన్నికల వ్యూహం బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి మంచి జరుగుతుందనే అభిప్రాయం ఆ పార్టీలోని పలువురు నేతలు అంటున్నారట. గుజరాత్ లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పీకే పనిచేసేందుకు రాహుల్- ప్రియాంకతో భేటీ సందర్భంగా అంగీకారం కుదిరిందని తెలుస్తోంది.

గతంలో తాను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు రాహుల్ గాంధీ నో చెప్పడంతో జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల నేతలను ఒకే తాటిపైకి తెచ్చేందుక ప్రశాంత్ కిషోర్ ముమ్మరంగా యత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో పీకే ప్రముఖ పాత్ర పోషించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా పలు పార్టీల కీలక నేతలతో పీకే తరచుగా సమావేశాలు అవుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపి ఎదుర్కొనేందుకు కూటమి ఏర్పాటు దిశగా పీకే సమావేశాలు జరుగుతున్నాయని జాతీయ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే.. ఇప్పటికే టీఆర్ఎస్ తరఫున తాను పనిచేస్తుండడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలనే విషయంలో పీకే కొంత డోలాయమానంలో పడ్డారని తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి వచ్చే ఎన్నికల కోసం పీకే పనిచేస్తుండడం గమనార్హం. ఆ క్రమంలోనే ఆయన కొద్ది రోజుల క్రితం మెదక్ జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి, పలువురు స్థానికులతో సంభాషించారు కూడా. ఒకవేళ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తరఫున పనిచేయాలని డిసైడ్ అయితే.. దాని పర్యవసానాలు తెలంగాణ రాజకీయాలపై పడే అవకాశం ఉందని రాజకీయ నిపుణుల చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu