పొంగులేటిదే పై‘చేయి’.. ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి పొగులేటి ప్రసాద్ రెడ్డి?

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలో ఒక్క స్థానం మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాలలోనూ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. ఆ తరువాత ఇటీవల బీఆర్ఎస్ తరఫున జిల్లా నుంచి గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

అయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బ్రహ్మాండంగా పెర్మార్మ్ చేసిన క్రెడిట్ అంతా పొంగులేటికే చెందుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన ఖమ్మం జిల్లా మొత్తం కాంగ్రెస్ స్వీప్ ఖాయమనీ, ఆ బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మరో నెల రోజులలో జరగనున్న లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలో వందకు వంద శాతం కాంగ్రెస్ గెలుచుకుంటుందన్న ధీమా ఇన్న సీటు ఏదైనా ఉందంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గమే. ఆ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. జిల్లా నుంచి  రేవంత్ కేబినెట్ లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. దీంతో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద బండి నడకే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో ఖమ్మం స్థానం సీటు విషయంలో కాంగ్రెస్ లో విపరీతమైన పోటీ ఏర్పడింది. 

 ప్రస్తుతం ఖమ్మం ఎంపీ టికెట్ రేసు కాంగ్రెస్ లో  తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే అధిష్ఠానం కూడా ఖమ్మం టికెట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. పోటీలో ఉన్న సీనియర్ నేతలను ఒక్కరొక్కరినే ఫిల్టర్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా ఈ టికెట్ కోసం పోటీ పడుతున్న వారిలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్లు మాత్రమే మిగిలాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో ఇద్దరూ కీలక నేతలే. ఈ నేపథ్యంలోనే ఖమ్మం సీటు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇప్పటి వరకూ ఏ నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. అయితే విశ్వసనీయంగా అందుతున్నే సమాచారం మేరకు మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్ రెడ్డిలలో హైకమాండ్ పొంగులేటి ప్రసాద్ రెడ్డి వైపే మొగ్గు చూపుతోంది.  

కాంగ్రెస్ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలలో పొంగులేటి ప్రసాద్ రెడ్డికే ఎక్కువ మద్దతు ఉందని తేలడం ఇందుకు ఒక కారణంగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక అన్నిటి కంటే ప్రధాన కారణం ఏమిటంటే.. అసెంబ్లీ ఎన్నికలలో జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ముందుగానే ప్రకటించి ఆ బాధ్యత తీసుకున్న పొంగులేటికి క్రెడిట్ ఇవ్వడం సమంజసమని కాంగ్రెస్ హైకమాండ్ భావించడమేనని చెబుతున్నారు.  కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ఖమ్మం టికెట్ మంత్రి పొగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఖరారైపోయిందనీ, ఇహనో, ఇప్పుడో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.