సంక్రాంతి ప్రయాణాల సందడి.. తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి ఆరంభమైపోయింది. పండుగను స్వగ్రామంలో జరుపుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో  తెలుగు రాష్ట్రాల్లో  బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి.  రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో పండుగకు నాలుగైదు రోజుల ముందే ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న వారు కుటుంబ సమేతంగా ఊర్లకు బయలుదేరడంతో  తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ప్రయాణాల సందడే కనిపిస్తోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు ఇలా అన్ని నగరాలలోనూ  బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది.   

రద్దీ కారణంగా తోపులాటలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా అవసరాన్ని బట్టి బస్సు సర్వీసులను పెంచుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ అవి ఏ మాత్రం సరిపోని పరిస్థితి నెలకొంది. ఏపీఎస్ ఆర్టీసీ అయితే పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని.  అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ కూడా తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ.. ప్రయాణీకులకు బస్సు సర్వీసుల విషయంలో సమాచారం అందించేందుకు అదనపు సిబ్బందిని కూడా నియమించాయి.  ఈ రద్దీ సంక్రాంతి సెలవులు ముగిసే వరకూ అంటే ఈ నెల  18 వరకూ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  ఇక హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ఇప్పటికే వాహనాల రద్దీ పెరిగింది. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ లు ఆరంభమైపోయాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu