రాజకీయంగా మళ్లీ క్రియాశీలం.. అయినా ఫామ్ హౌస్ కే పరిమితం!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎట్టకేలకు రాజకీయంగా మళ్లీ క్రియాశీలం అవుతున్నారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి పాలై.. అధికారానికి దూరమైన క్షణం నుంచీ కేసీఆర్  దాదాపుగా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అనే విధంగా యాక్టివ్ పోలటిక్స్ కు దాదాపు దూరమయ్యారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అడపదడపా పార్టీ నేతలను ఎవరినైనా కలిసినా వారిని ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడారే తప్ప ఆ ఫామ్ హౌస్ వీడి బయటకు రాలేదు. 

పార్టీ పరాజయం పాలైన తరువాత ఇప్పటి వరకూ ఆయన ఫామ్ హౌస్ వీడి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల మీద లెక్కించవచ్చు. ఒక సారి అంటే ఒకే ఒక రోజు అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీలో ఆయన నోరెత్తింది లేదు. బయటకు వచ్చి మీడియాతో ముక్త సరిగా రెండు మాటలు మాట్లాడి మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. తాజాగా ఇటీవల పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఫామ్ హౌస్ వీడి తెలంగాణ భవన్ కు వచ్చారు. అక్కడా అంతే ప్రసంగం ముగించేసి మళ్లీ ఫామ్ హౌస్ కు చేరిపోయారు. ఇక ఇప్పుడు తాజాగా ఆయన పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. అయితే ఆ సమావేశం కోసం కేసీఆర్ బయటకు రాలేదు. పార్టీ నేతలనే ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నారు.  ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి పార్టీ దూరంగా ఉండటం, అనూహ్యంగా బీజేపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడంతో రాజకీయంగా బీఆర్ఎస్ కథ ఇక ముగిసినట్లేనన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్న సమయంలో కేసీఆర్ పార్టీ నేతలతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

అయితే ఆయన తెలంగాణ భవన్ కు రాకుండా నేతలను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడటమే పార్టీ వర్గాలలో ఒకింత అసంతృప్తికి కారణమయ్యింది. ఈ విషయాన్ని పార్టీ నేతలే ప్రైవేటు సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. అసలు ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీని పోటీకి దూరం పెట్టడమే ఒక రాజకీయతప్పదమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. హరీష్ రావు వంటి సీనియర్ నాయకుడు ఈ విషయాన్ని నేరుగా కేసీఆర్ కే చెప్పి.. పార్టీ తరఫున అభ్యర్థిని రంగంలోకి దింపుదామని కోరినప్పటికీ కేసీఆర్ వినలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పోటీకి దూరం కావడం వల్ల బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అన్న విమర్శలకు, ఆరోపణలకు బలం చేకూర్చినట్లు అవుతుందని ఎంతగా చెప్పినప్పటికీ కేసీఆర్ పట్టించుకోలేదని అంటున్నారు. సరే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో రెండు బీజేపీ గెలుచుకోవడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పోలిటికల్ స్పేస్ ను బీజేపీ ఆక్రమించేసిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో పార్టీ నేతలలో జరిపిన భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 

ఈ సమావేశంలో  పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు.   అంతా బానే ఉన్నా.. కేసీఆర్ ఈ సమావేశాన్ని తన ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేయడం పట్ల మాత్రం బీఆర్ఎస్ నేతలలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇలా ఫామ్ హౌస్ లో భేటీల వల్ల ప్రజల దృష్టిలో పలుచన అవుతామన్న ఆందోళనా వారు వ్యక్తం చేస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu