మూడు దశాబ్దాలుగా ఓటమి ఎరగని ఎమ్మెల్యే ..

ఒక్కసారి మంత్రి చేయి గణనాధ... నువ్వు ఓడకుంటే ఒట్టుపెట్టు గణనాధ ... ఇది ఎప్పుడో ఎవరో సినిమా కవి రాసిన పాట. అందరి విషయంలో కాకున్నా, కొందరి విషయంలో అది నిజమే అయింది. మంత్రులే కాదు, ఒక్కసారి  ఎమ్మెల్యేగా గెలిచిన వారు మళ్ళీ రెండవసారికే ప్రజల విశ్వాసం కోల్పోవడం కూడా కొందరి విషయంలో నిజమే. అయితే, వరసగా ఎనిమిది సార్లు, తొమ్మిది సార్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన వారు కూడా లేక పోలేదు.అలాగే అసలు ఓటమి అన్నదే ఎరగని రాజకీయ ఉద్దండులు ఉన్నారు. అలాగే ఉద్దండులు అనుకున్న ఇందిరా గాంధీ, వాజపేయి, అద్వానీ, ఎన్టీఆర్ వంటి మహా నాయకులూ కూడా ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 

అయితే, ఇప్పడు ఈ చర్చ ఎందుకంటే, అందుకో కారణముంది. వచ్చే నెల (డిసెంబర్) మొదటి వారంలో ప్రధాని మోడీ స్వరాష్ట్రంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే కదా. మొత్తం 182 స్థానాలున్న, గుజరాత్ లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8 న ఇప్పటికే పోలింగ్ పూర్తి చేసుకున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాలలో ఒకటి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల  స్వరాష్ట్రం గుజరాత్ అయితే, రెండవ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు, జేపీ నడ్డా స్వరాష్ట్రం. ఆవిధంగా ఈ రెండు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అలాగే, రెండు రాష్ట్రాలఅసెంబ్లీ ఎన్నికలు రెండు రాష్ట్రాలలో ప్రధాన ప్రతిపక్షగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి  కూడా కీలకంగానే భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు జరిగి, ఇంచుమించుగా 25 సంవత్సరాల తర్వాత జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో, గాంధీ కుటుంబం వెలుపలి, సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత జరుగతున్న తొలి ఎన్నికలు కావడం  చేతనూ  హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, దేశం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఖర్గేకు ఇది తొలి పరీక్ష. అయితే, ఇంతవరకు వచ్చిన  సర్వేలన్నీ, రెండు రాష్ట్రాలలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందనే అంటున్నాయి. అయితే  సర్వేలు నిజం అవుతాయా లేదా అనేది తేలేందుకు డిసెంబర్ 8 వరకు ఆగవల్సిందే. 

సరే, అదెలా ఉన్నా, అది గుజరాత్ అనే కాదు, మరే రాష్ట్రం అయినా అసెంబ్లీ ఎన్నికలు అనగానే, అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి. అలాగే, ఆసక్తికర వ్యక్తులు, వారి వారి గెలుపు ఓటములు  ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇప్పుడు మనం పైన గుర్తు చేసుకున్న, ‘ఒక్కసారి మంత్రి చేయి గణనాథా, నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథా’ పాటలో లాగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారే మళ్ళీ గెలవడం అయ్యేపని కాదని అనుకుంటున్న సమయంలో, గుజరాత్ లోని ద్వారకా ఎమ్మెల్యే పణుభా మాణెక్ ఏకంగా వరసగా ఏడు పర్యాలు,అది కూడా ఒకే నియోజక వర్గం, నుంచి గెలిచి, ఇప్పడు ఎనిమిదవ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మళ్ళీ బరిలో దిగారు. 

ఏకంగా 32 ఏళ్లుగా ఒకే నియోజక వర్గం నుంచి గెలుస్తూ వస్తున్న పణుభా మాణెక్ నియోజక వర్గం అయితే మారలేదు కానీ, పార్టీ అయితే మారారు. ముందుగా ఆయన  1990లో తొలిసారిగా స్వతంత్ర అభ్యర్ధిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అలాగే 1995, 1998లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ఆయన స్వతంత్ర అభ్యర్ధిగానే విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాణెక్, 2002 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్‌పై గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకుని, 2007, 2012, 2017లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు.

ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.అయితే,  1995 నుంచి, ఇంచుమించుగా 27 ఏళ్లుగా   రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయంలో ఎవరికైనా, అనుమానాలు ఉంటే ఉంటాయేమో, కానీ, పణుభా మాణెక్ గెలుపు విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి అనుమానం లేదని  నియోజక వర్గం ప్రజలు, అదే విధంగా మాణెక్, విశ్వాసం వ్యక్త పరుస్తున్నారు. అదేమంటే ప్రజలతో పెనవేసుకున్న సమబంధాలే తనకు శ్రీరామ రక్ష అంటున్నారు, మాణెక్.