బండలు టైంకి పరవలేదని.... బంధించేసింది!

భారతదేశంలో అధికారం అంటే బాధ్యత కాదు! ఇక్కడ అధికారం అంటే అహంకారం! ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే తాను సీఎంగా వున్నప్పుడు మోదీ ఓ కొత్త నిర్వచనం ఇచ్చారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదనీ... కామన్ మ్యాన్ అని చెప్పారు. అందుకు తగ్గట్టే ఆయన నిరంతరం కష్టపడుతూ అప్పుడు రాష్ట్రానికి, ఇప్పుడు దేశానికి సేవ చేస్తున్నారు. కాని, తనని తాను సేవకుడని నిగర్వంగా చెప్పుకునే మోదీ క్యాబినేట్లో మాత్రం అందరూ అంత హుందాగా వుండటం లేదు! 


అనుప్రియ పటేల్... ఎవరీమే అంటారా? ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఒక యువ రాజకీయ నాయకురాలు. పార్టీ అప్పాదళ్. కొద్దోగొప్పో ఓబీసీల బలం వుండటంతో ఎన్డీఏలో చేర్చుకున్నారు ఈ మధ్యే. పైగా అప్నాదళ్ నేత అనుప్రియకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అలా అధికారం దక్కటంతో అనుప్రియా కళ్లు సహజంగానే అందరూ ఇండియన్ పొలిటీషన్స్ లా నెత్తికెక్కాయి! తన ఇంట్లో ప్రభుత్వం తరుఫున పని చేయటానికి వచ్చిన అధికారుల్ని రూంలో వేసి బంధించే దాకా వెళ్లాయి!
అసలేమైందంటే... అనుప్రియ కేంద్ర మంత్రిగా ఢిల్లీలోని తన అధికార నివాసాన్నిమరమ్మత్తు చేయించుకోవాలనుకుంది. వెంటనే ప్రభుత్వం తరుఫున ఆ పని చేసే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ అధికారుల్ని పిలిపించింది. వాళ్లకు టైల్స్ పరవమని పురమాయించింది. అంతే కాదు, ఆలస్యం చేస్తే రూంలో వేసి బంధిస్తానని హెచ్చరించింది! కాని, అధికారులు అన్న టిైంకి పని పూర్తి చేయలేదు. అలా గవర్నమెంట్ అధికారులు చెప్పిన టైంకి పని పూర్తి చేయకపోవటం మన దేశంలో అత్యంత సాధారణం. అందువల్ల సామాన్య ప్రజలు నానా తిప్పలు పడటం కూడా మామూలే! కాని, అనుప్రియా మేడం కేంద్ర మంత్రి కదా... అమాంతం కోపం నషాళానికి అంటింది! వెంటనే అన్నంత పని చేసింది!


మంత్రిగారి మనుషుల చేత గదిలో బంధింపబడ్డ అధికారులు ఎలాగో మరో అధికారికి ఫోన్ చేసి బయటపడ్డారు. కాని, అసలు ఈ దౌర్జన్యం ఏంటని అడిగేవారు మాత్రం లేరు? ఎక్కడ ఏం జరిగినా చెప్పుకోవాల్సింది మోదీ సర్కార్ కే! కాని, ఆయన గవర్నమెంట్లోనే భాగస్వామి అయిన అప్నాదళ్ నాయకురాలు గూండాగిరి చేస్తే ఇక చెప్పేదెవరికి? ఇలాంటి వాళ్లని స్వయంగా ప్రధానే ఓ కంట గమనిస్తే బావుంటుంది! దీర్ఘ కాలంలో వచ్చే ముప్పు తప్పుతుంది... 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu