పీఎం పర్యటన రద్దు వెనక ఎంపీల పాత్ర?

హైదరాబాద్: పీఎం మన్మోహన్ సింగ్ హైదరాబాద్ పర్యటన రద్దు వెనక పార్లమెంటు సభ్యుల పాత్ర ఉన్నట్లు వార్తలు వచ్చాయి. రాజీవ్ యువకిరణాలు పథకాన్ని వచ్చే నెల 4వ తేదీన ప్రధాని హైదరాబాదులో ప్రారంభించాల్సి ఉంది. అయితే, దానిలోని లోపాలను, ఇతర అంశాలను ఎత్తి చూపుతూ తెలంగాణకు చెందిన కొంత మంది పార్లమెంటు సభ్యులు ప్రధానికి లేఖ రాశారని తెలిసింది. అయితే, ఢిల్లీకి విదేశీ అతిథులు రావడమే పర్యటన రద్దుకు కారణమని సీఎం కార్యాలయం వివరణ ఇచ్చింది. ప్రైవేటు రంగంలో మొత్తం 15 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఈ పథకంపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని కొందరు ఎంపీలు నాలుగు రోజుల కిందట ప్రధానికి లేఖ రాసినట్లు తెలిసింది. ప్రభుత్వ సిఫారసుల మేరకు ఉద్యోగం ఇచ్చినా వారి సామర్థ్యం పరిశీలించి, తమకు అనువుగా లేకుంటే పక్కకు తప్పిస్తారని అశాశ్వతమైన ప్రైవేటు ఉద్యోగాలను కల్పించే పథకానికి అట్టహాసంగా ప్రారంభోత్సవాలను నిర్వహించడం మంచిదా, కాదా ఆలోచించుకోవాలని ప్రధానికి రాసిన లేఖలో వారు వివరించినట్లు తెలిసింది. రాజీవ్ యువ కిరణాల కింద ప్రభుత్వ రంగ సంస్థలలో నియామకాలు జరుగుతున్నట్లు యువత భావిస్తోందని, అందుకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థల్లో వెల్డర్లు, ఫిట్టర్లు వంటి చిన్న చిన్న ఉద్యోగాలను ఇప్పించడం వల్ల ప్రభుత్వానికి ఒనగూరే ప్రయోజనం ఏమిటని కూడా అందులో ప్రశ్నించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu