మార్పు గురించి ప్లేటో ఏమి చెప్పాడు?

మార్పు అనేది ఎంతో సహజమైనది. తప్పనిసరి అయినది కూడా. మార్పు జరగనిది అంటూ ఏమీ లేదు ఈ ప్రపంచంలో. కాలంతో పాటు ఒక దశ నుండి మరొక దశకు రూపాంతరం చెందుతూ, కొత్తగా ఆవిష్కరమవుతూ, ఒక రూపం పతనమవుతూ ఉంటుంది. అయితే ఈ మార్పు నిజంగానే అన్నింటిలో జరుగుతుందా??

ప్రపంచంలో ఉన్న ప్రముఖ తత్వవేత్తలలో ప్లేటో కూడా ఒకరు. ఈయన మార్పు గురించి పరిపరివిధాలుగా విశ్లేషణ చేశారు. ముఖ్యంగా మార్పు గురించి ఈయన విశ్లేషణ ఎంతో లోతుగా సాగుతుంది. మార్పు చెందేవి, మార్పు చెందనివీ అంటూ మార్పు గురించి, అందులో ఉన్న లోతుపాతుల గురించి ప్లేటో చెప్పిన మాటలు...

మనం మొట్టమొదటే స్పష్టంగా అడగవలసిన ప్రశ్న ఒకటుంది. ఎల్లప్పుడూ ఉంటూ మార్పు చెందనిదేది? ఎల్లప్పుడూ మార్పు చెందుతూ ఎప్పటికీ ఉండనిదేదీ? హేతువు వల్లా, ఆలోచన వల్లా గ్రహించబడేది ఏదో అదెప్పటికీ ఒక్క స్థితిలోనే ఉంటుంది. మనం దేని గురించి హేతువు సహాయం లేకుండా ఇంద్రియ సంవేదలనల ద్వారా మాత్రమే అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటామో అది ఎల్లప్పుడూ మార్పు చెందుతూ, నశిస్తూ ఉండేదే. అదెప్పుడూ వాస్తవంగా ఉండేదే కాదు.

మార్పు చెందే ప్రతీదీ సృష్టించబడి ఉండేదే అయిఉండాలి. దాన్ని ఏదో అవసరం కోసం ఏదో ఒక కారణం చేత సృష్టించి ఉండాలి. ఎందుకంటే  కారణం లేకుండా ఏదీ సృష్టించబడదు. సృష్టికర్త తన సృష్టిని మార్పు లేని తరహాలో చిత్రించి ఉంటే అది పరిపూర్ణంగా, సవ్యంగా ఉంటుంది. అలా కాక అతడు ఒక సృష్టి తరహాలోనే తన సృష్టి చేసి ఉంటే అది అపరిపూర్ణంగా, అపసవ్యంగా ఉంటుంది. అప్పుడు సహజంగానే ఈ ప్రశ్న వస్తుంది. నిజానికి ఈ ప్రశ్న మొదటే అడగవలసిన ప్రశ్న.  అదేమంటే ఈ ప్రపంచం అనాదిగా ఎప్పుడూ ఉంటున్నదేనా? లేదా సృష్టించబడ్డదా? దీనికో అది అంటూ ఉందా? ఇది సృష్టించబడ్డదేనేమో, ఎందుకంటే ఇది దర్శనీయం, స్పృశనీయం, దీనికో దేహముంది. 

కాబట్టి ఇంద్రియగ్రాహ్యం. ఇంద్రియాల ద్వారా గ్రహించబడేవీ, అభిప్రాయాల ద్వారా తెలియవచ్చేవీ తప్పకుండా ఒక సృష్టిక్రమంలో సృష్టించబడేవే. సరే సృష్టించబడ్డ ప్రతి దానికీ అవసరమూ, ఒక కారణమూ ఉండాలి కానీ ఈ విశ్వానికి సృష్టికర్త ఎవరో మనకి తెలియదు. తెలిసినా దాన్ని తక్కినవాళ్ళకి వివరించలేం అయినా అతన్ని అడగడానికి ఒక ప్రశ్న మిగిలే ఉంటుంది. అతడు ఈ ప్రపంచాన్ని ఏ నమూనా ఆధారంగా నిర్మించి ఉంటాడు? మార్పులేని శాశ్వత వస్తువు ఆధారంగానా? లేక సృష్టించబడి మార్పు చెందే నమూనా ఆధారంగానా?

 ఒకవేళ ప్రపంచం సవ్యంగానూ, ప్రణాళిక ఉత్తమంగానూ ఉండి ఉంటే మనం అతని నమూనా మార్పులేని శాశ్వత వస్తువని భావించవచ్చు. అలాకాక మరోలా అయిఉంటే (అటువంటి ఊహే దైవదూషణతో సమానమైనప్పటికి) ఆ నమూనా మరోలా ఉండి ఉంటే, అప్పుడతని నమూనా అశాశ్వత వస్తువని చెప్పవచ్చు. కానీ ఈ ప్రపంచాన్ని చూసి ఎవరేనా ఇట్టే గ్రహించవచ్చు. ఇది శాశ్వత వస్తువు నమూనా మీదనే నిర్మితమయ్యిందని. ఆ శాశ్వత వస్తువుని మనం హేతువు మీద నుండి, ఆలోచన మీద నుండీ మాత్రమే గ్రహించగలమని ప్లేటో చెబుతాడు.

                                       ◆నిశ్శబ్ద.