బీహార్ ఎన్నికలు.. పీకే వ్యూహ వైఫ్యలాలు!

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పీకే జన సురాజ్ పార్టీ ప్రభావం నామమాత్రమేనా? కింగ్ మేకర్, ప్రభుత్వ ఏర్పాటులో కీ ఫ్యాక్టర్ అంటూ పీకేపైనా, ఆయన జన సురాజ్ పార్టీపైనా సర్వేలు చెప్పినదంతా ట్రాషేనా? విశ్లేషకులు పీకే గురించి, బీహార్ ఎన్నికలలో ఆయన పాత్ర గురించి చెప్పినవన్నీ అభూతకల్పనలేనా? అన్న ప్రశ్నలకు పీకే స్వయంగా ఔనని చెప్పినట్లైంది.. ఆయన తాను వ్యక్తిగతంగా పోటీలో నిలబడటం లేదని ప్రకటించడం ద్వారా. 

ఎన్నికల వ్యూహకర్తగా తిరుగులేని విజయాలు అందుకున్న పీకే ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో నిలబడ్డారు. పెరిటి వైద్యం పని చేయదు అన్నట్లు పీకీ వ్యూహాలు ఆయన సొంత పార్టీ జన సురాజ్ కు ఇసుమంతైనా పని చేయడం లేదని ఆయన పోటీ నుంచి వైదొలగడం ద్వారా తేటతెల్లమైందంటున్నారు పరిశీలకులు.  
ప్రశాంత్ కిశోర్ బీహార్ ఎన్నికలలో జనసూరజ్ పార్టీని గెలుపు గుర్రంగా మార్చేందుకు గత రెండేళ్లుగా నిర్విరామంగా శ్రమించారు. పాదయాత్ర చేశారు. అధికార, విపక్ష కూటములపై విమర్శలు గుప్పించారు. యువతను ఆకట్టుకుని బీహార్ నే ఏలేయడానికి నేల విడిచి సాము చేశారు. ఉద్యమాలు, ఆందోళనలూ సరేసరి. 

సరే ఇక ఇప్పుడు ఎన్నికల వేళ ఎన్డీయే కూటమి, మహాఘట్ బంధన్ (ఇండియా కూటమి) కంటే ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించి గెలుపు రేసులో ముందున్నానని చాటుకున్నారు. రెండు జాబితాలు ప్రకటించేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడికి ప్రత్యర్థిగా నిలబడతానని చెప్పుకుంటూ వచ్చిన ఆయన తీరా జాబితాల ప్రకటన వేళ రఘోపూర్ నియోజకవర్గంలో తాను కాదు మరో అభ్యర్థిని నిలబెట్టారు. అక్కడే ఆయన గెలుపు బాటలో లేరని తేటతెల్లమైందంటున్నారు. ఇక ఆ తరువాత ఒక జాతీయ స్థాయి వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను వ్యక్తిగతంగా పోటీకి దూరం అని ప్రకటించేసి.. పార్టీకి విజయావకాశాలు అంతంతమాత్రమేనని చెప్పకనే చెప్పేశారు.  తాను  పోటీ చేసి గెలవడం కంటే తన పార్టీని గెలిపించుకోవడం ముఖ్యమన్న ప్రశాంత్ కిశోర్.. ఒక రకంగా జనసూరాజ్ కార్యకర్తలలో జోష్ ను చంపేశారని చెప్పాలి. 
అయితే తాను పోటీ నుంచి తప్పుకున్నా.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జన సురాజ్ పార్టీ విజయం ఖాయమంటూ వ్యక్తం చేసిన ధీమా మేకపోతు గాంభీర్యంగానే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
నిజంగా పార్టీ విజయం కోసం ఫుల్ టైం కేటాయించడానికి తాను పోటీలో ఉండకూడదని ఆయన నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్టలేరు.. కానీ ఇదే ప్రకటన ఆయన చివరి నిముషంలో కాకుండా ఇంకా చాలా ముందే ప్రకటించి ఉంటే.. బెటర్ గా ఉండేది. అలా చేసి ఉంటే.. ఇప్పుడు ఆయన ఓటమి భయంతో పోటీ నుంచి పలాయనం చిత్తగించారన్న విమర్శలకు తావు ఉండేది కాదు.  ఇప్పుడు సరిగ్గా ఎన్నికల వేళ తాను పోటీకి దూరం అని ప్రకటించడంతో  ప్రత్యర్థులకు ఆయన అస్త్రసన్యాసం చేశారంటూ ఎద్దేవా చేయడానికి అవకాశం ఇచ్చినట్లైంది. సొంత పార్టీలో కూడా ఆఖరి నిముషంలో తమ అధినేత కాడె వదిలేశారన్న భావన వ్యక్తం అయ్యేందుకు ఆస్కారం ఇచ్చింది. ఇక ప్రజలు  కూడా గెలుపు సత్తా లేని పీకే పార్టీకి ఓటేసి ఏం లాభం అన్న భావనకు లోనయ్యే అవకాశాలున్నాయి. అంటే తాను పోటీ నుంచి విరమించుకోవడంపై ప్రశాంత్ కిశోర్ ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా.. దాని వల్ల వాటి వల్ల జనసురాజ్ పార్టీకి కలిగే ప్రయోజనం శూన్యమేనని అంటున్నారు. యుద్ధానికి ముందు అస్త్రసన్యాసం చేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.