కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ డుమ్మా?

కాంగ్రెస్ లో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. మేడారం పనుల కాంట్రాక్టుల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేటి మధ్య నెలకొన్న విభేదాలు కేబినెట్ భేటీపైనా ప్రభావం చూపనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. విభేదాలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవలసింది పోయి మీడియా ముందుకు వెళ్లడమేంటన్నది రేవంత్ ఆగ్రహంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ మాజీ ఓఎస్డీ వ్యవహారం అగ్నికి అజ్యం పోసినట్లైంది. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు ఏకంగా మంత్రి సురేఖ నివాసానికి వెళ్లడం, అక్కడ కొండా సురేఖ కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా మీడియా ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా నిప్పులు చెరిగారు.  ఇక దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. ఉరుములేని పిడుగులా మంత్రి కొండా సురేఖకు చెందిన దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి మేడారం పనులను తప్పించింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మేడారం పనుల రికార్డులను వెంటనే ఆర్అండ్ బి శాఖకు అప్పగించాల్సిందిగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు జరగనున్న కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టాలని కొండా సురేఖ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టడమే కాదు.. అవసరమైతే మంత్రి పదవికి కూడా రాజీనామా చేసే అవకాశాలున్నాయంటున్నారు. కేబినెట్ భేటీకి గైర్హాజర్ అవుతున్నట్లు కొండా సురేఖ ప్రకటించనప్పటికీ, ఆమె సన్నిహిత వర్గాలు మాత్రం ఆమె కేబినెట్ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు లేవని అంటున్నారు.