హెలిప్యాడ్ లో కాకుండా సభా ప్రాంగణంలో చోపర్ ల్యాండింగ్.. మంత్రులకు తప్పిన ప్రమాదం
posted on Apr 21, 2025 1:36PM

మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ లో నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు హెలికాప్టర్ లో ఈ ముగ్గురు మంత్రులూ వెళ్లారు. వారి హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి అధికారులు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో కాకుండా పైలట్ ఏకంగా సభా ప్రాంగణంలోనే హెలికాప్టర్ ను ల్యాండ్ చేయడం గందరగోళానికి దారి తీసింది.
హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో రెక్కల నుంచి వచ్చిన గాలి కారణంగా భారీగా దుమ్ము రేగింది. అంతే కాకుండా ఆ గాలి ధాటికి సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు కూలిపోయాయి. పంట ఉత్పత్తులకు ఏర్పాటు చేసిన స్టాళ్లు కొన్ని ధ్వంసమయ్యాయి. జనం భయంతో పరుగులు తీశారు. అదృష్ట వశాత్తూ ఈ ఘటనలో మంత్రులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఈ ఘటనలో బందోబస్తుకు వచ్చిన పోలీసులలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు.