అయోధ్య రామమందిరం భూమిపూజ ఆపివేయాలని హైకోర్టులో పిల్
posted on Jul 24, 2020 4:50PM
ప్రస్తుతం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగనుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆ ఏర్పాట్లలో నిమగ్నమైన వేళ.. భూమి పూజ ఆపాలంటూ అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. అన్‌లాక్ 2 గైడ్ లైన్స్ ప్రకారం ప్రార్థనా మందిరాల్లో సామూహిక వేడుకలు నిర్వహించకూడదని ఢిల్లీకి చెందిన లాయర్ సాకేత్ గోఖలే పిల్ వేశారు. ఎక్కువ మంది ప్రజలు ఒక్క చోట గుమిగూడితే వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదముందని అందులో అయన పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భూమి పూజ కార్యక్రమంపై స్టే విధించాలని హైకోర్టును కోరారు. ఇందులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు. ఐతే ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ ఇప్పటి వరకు విచారణకు స్వీకరించలేదు. ఐతే హైకోర్టులో పిల్ వేసినందువల్ల, కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించిన విషయం తెలిసిందే. కేవలం 150 మంది అతిథులు సహా 200 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించింది.