జనసేనకి ఎన్నికల కమిషన్ గుర్తింపు
posted on Dec 11, 2014 10:22AM

సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’ పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు లభించింది. ఎన్నిక కమిషన్ చట్టం 1951లోని 29ఎ నిబంధన ప్రకారం జనసేన పార్టీకి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించింది. జనసేన పార్టీకి రాజకీయ పార్టీగా గుర్తింపు ఈ ఏడాది నవంబర్ 24వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. జనసేన పార్టీకి 56/118/2014/PPS-I అనే గుర్తింపు సంఖ్యను కూడా ఎన్నికల కమిషన్ కేటాయించింది. జనసేన పార్టీ ఏర్పాటు విషయం మీద ఎవరికైనా అభ్యంతరాలున్నాయా అనే విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలించింది. అయితే ఎవరి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో జనసేనను గుర్తిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే ఈ పార్టీ ఎన్నికలలో పోటీ చేసిన పక్షంలో ఎన్నికల గుర్తు కోసం కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పార్టీగా గుర్తింపు పొందింది. రెండు రాష్ట్రాల్లో జరిగే స్థానిక ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.