కేసీఆర్ కు పాల్ షాక్.. కొత్త సచివాలయంపై హై కోర్టులో పిల్

కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఓ పొలిటికల్ జోకర్ గా విపరీతంగా గుర్తింపు పొందిన నాయకుడు. ఆయనను సామాన్య ప్రజలే కాదు, రాజకీయ నాయకులు పార్టీలూ కూడా పెద్ద సీరియస్ గా తీసుకోరు. ప్రజాశాంతి పార్టీ అధినేతగా కేఏపాల్ ను ఎప్పుడూ ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఆయనా పెద్దగా పట్టించుకోలేదు. నవ్వి పోదురుగాక నాకేటి అన్నట్లుగా ఆయన తాను చేయదలచుకున్నది చేసేస్తూ, చెప్పదలచుకున్నది చెప్పేస్తూ ముందుకు సాగుతుంటారు.

మీడియా కూడా ఆయన ప్రెస్ మీట్లను, ప్రకటనలను ఒక రిలీఫ్ మ్యాటర్ గానే ఎంచి అందుకు తగ్గ ప్రయారిటీయే ఇస్తూ ఉంటుంది. అలాంటి పాల్ ఒక సీరియస్ ఎలిగేషన్ చేశారు. కోర్టుకు ఎక్కారు. తెలంగా కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదంపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలను ఎప్పటిలాగే జోక్ గా కొట్టి పారేద్దామనుకున్న అందుకు వీలు లేకుండా భారాస సర్కార్ వ్యవహరించింది. అగ్ని ప్రమాదం అనంతర పరిస్థితిని పరిశీలించడానికి వెళ్లిన విపక్ష కాంగ్రెస్ నేతలను అనుమతించలేదు. దీంతో కొత్త సచివాలయం.. ఇంకా ప్రారంభానికి నోచుకోకుండానే అగ్ని ప్రమాదం బారిన పడటం వెనుక ఏదో ఉన్నదన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యేలా కేసీఆర్ సర్కార్ వ్యవహరించింది. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకుని కేఏ పాల్ కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఈ పిల్ భారాస సర్కార్ కు దిమ్మతిరిగేలా చేసింది. ఇంకా ప్రారంభానికి నోచుకోని తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదంపై పిల్ వేశారు. అందులోనే సచివాలయం ప్రారంభానికి కేసీఆర్ నిర్ణయించిన ముహూర్తాన్ని కూడా సవాల్ చేశారు. అంబేడ్కర్ పేరుమీద నిర్మించిన ఆ సచివాలయ ప్రరంభాన్ని కేసీఆర్ తన పుట్టిన రోజు నాడు ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ జన్మదినం అయిన ఏప్రిల్ 14న దీనిని ప్రారంభించేలా అదేశాలు ఇవ్వాలని ఆ పిల్ లో కోరారు. అంతేనా.. పాత సచివాలయాన్ని వాస్తు పేరుతో కూల్చివేసి వందల కోట్ల ప్రజాధనంతో కొత్త భవనాన్ని నిర్మించి, తన పుట్టిన రోజున దానిని ప్రారంభించడం ద్వారా వ్యక్తిగత ప్రతిష్ట కోసం పాకులాడుతున్నారని పాల్ ఆ పిల్ లో ఆరోపించారు.  

ఆయన అక్కడితో ఆగలేదు. తన పిల్ ను విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారంటూ.. చీఫ్ జస్టిస్ బెంచ్ కు నివేదించారు. దీంతో పాల్ పిల్ కు నంబరింగ్ ఇవ్వాలని రిజిస్ట్రార్ కు కోర్టు ఆదేశాలు జారి చేసింది. దీంతో కేఏ పాల్ పిల్ మంగళవారం ( ఫిబ్రవరి 7) విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ పిల్ ను విచారించి కోర్టు ఏ వ్యాఖ్యలు చేస్తుంది, ఏ ఉత్తర్వ్యులు జారీ చేస్తుంది అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.  ఇంత కాలం జోకర్ గా అభివర్ణిస్తూ.. ఆయన చేసే ప్రతి పనినీ, మాట్లాడే ప్రతి మాటనూ ఓ జోక్ గా తీసుకుని నవ్వుకుంటున్న వారందరికీ ఈ పిల్ ద్వారా పాల్ తనలో ఉన్న ఒక సీనియస్ నాయకుడిని చూపారన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.