సమావేశాలు పొడిగించినందుకు కూడా నిరసనలా?
posted on May 8, 2015 9:35PM
.jpg)
సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు పొడిగించమని ప్రతిపక్షాలు అధికార పార్టీలని డిమాండ్ చేయడం గురించి వింటాము. పొడిగించకపోతే అధికార పార్టీకి ప్రజాసమస్యల గురించి సభలో చర్చించడానికి శ్రద్ధ లేదని నిందిస్తుంటాయి. కానీ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీతో సహా అనేక ప్రతిపక్ష పార్టీలు మోడీ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు మూడు రోజులు పొడిగించినందుకు ఈరోజు సభలో నానా రభస చేసాయి. అయితే అత్త కొట్టినందుకు కాదు ఏడ్చింది తోడికోడలు నవ్వినందుకేనన్నట్లు మోడీ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు పొడిగించినందుకు కాక తమకు మాట మాత్రం చెప్పకుండా సమావేశాలు పొడిగించారంటూ ‘మోడీ నియంతృత్వం సహించేది లేదు’ అంటూ పార్లమెంటులో ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేసాయి.
అయితే బీజేపీ వారి ఆరోపణలను తిరస్కరించింది. గతంలో కూడా ఈవిధంగా ఆఖరు నిమిషంలో పార్లమెంటు సమావేశాలు పొడిగించబడ్డాయని కానీ నిన్న(గురువారం) రాజ్యసభ సమావేశాలు రాత్రి వరకు కొనసాగడంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ యం. వెంకయ్యనాయుడుతో సహా అనేకమంది మంత్రులు సభా కార్యక్రమాలను మధ్యలో విడిచిపెట్టి రాలేకపోవడంతో పార్లమెంటు సమావేశాలు పొడిగిస్తున్న సంగతి కొన్ని ప్రతిపక్ష పార్టీలకు తెలియజేయలేకపోయామని బీజేపీ వాదించింది. కానీ బిజినస్ అడ్వయిజరీ కమిటీలో సమావేశంలో పాల్గొన్న సభ్యులకు దీని గురించి తెలుసునని బీజేపీ వాదించింది. తెదేపా, తెరాస, వైకాపా, ఏ.ఐ.ఏ.డి.యం.కె. పార్టీలు సమావేశాల పొడిగింపుకి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పాయి. ఈ సమావేశాల పొడిగింపు కారణంగా రాహుల్ గాంధీ ఈనెల 12న అదిలాబాద్ జిల్లాలో నిర్వహించదలచిన పాదయాత్రను 15కి వాయిదా వేసుకొన్నారు.