నేటి నుండి ఏపీలో ఉపాద్యాయ పరీక్షలు
posted on May 9, 2015 8:25AM
.gif)
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఈరోజు నుండి మొదలవుతున్నాయి. ఈరోజు నుండి మూడు రోజుల పాటు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,97,294 మంది హాజరవుతున్నారు. వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2560 పరీక్షా కేంద్రాలను ఏర్పటు చేసారు. ఈ పరీక్షల ద్వారా మొత్తం 10,313 ఉపాధ్యాయ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. వేసవి శలవుల తరువాత మళ్ళీ పాఠాశాలలు మొదలయ్యేలోగానే జూన్ 1న పరీక్షా ఫలితాలు వెల్లడించి, నియామకాలు కూడా పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పడంతో పరీక్షకు హాజరవుతున్న వారిలో ఒకరకమయిన ఆశ, ఉత్సాహం నెలకొని ఉంది.
సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షల షెడ్యూల్: శనివారం ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.
బాషా పండితుల పరీక్షల షెడ్యూల్: ఆదివారం ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.
స్కూల్ అసిస్టెంట్ పరీక్షల షెడ్యూల్: సోమవారం ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 1.15గంటల వరకు.
స్కూల్ అసిస్టెంట్ (బాషేతర) పరీక్షల షెడ్యూల్: సోమవారం మధ్యాహ్నం 3గంటల నుండి సాయంత్రం 6.15 గంటల వరకు.
సెకండరీ గ్రేడ్ పరీక్షలకి మొత్తం 57,520 మంది, బాషా పండితుల పరీక్షలకి 53,044 మంది, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకి 56, 373 మంది, స్కూల్ అసిస్టెంట్ (బాషేతర) పరీక్షలకి 2,20,490 మంది హాజరవుతున్నారు.
ఈ పరీక్షలకి హాజరవుతున్న వారి కోసం జిల్లాల వారిగా మరియు రాష్ట్ర స్థాయిలో ఒక సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ కమీషనర్ సంద్యా రాణి మీడియాకు తెలిపారు. రాష్ట్ర స్థాయి సహాయ కేంద్రాల ఫోన్ నెంబర్లు: 9848854943, 9959400080.