తుపాకుల మోతతో దద్దరిల్లిన పారిస్
posted on Nov 19, 2015 7:33AM
640360(1).jpg)
పారిస్ నగరానికి ఉత్తరాన్న గల సెయింట్ డెనిస్ అనే ప్రాంతం నిన్న తుపాకులు కాల్పులు, బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. గత శుక్రవారం సాయంత్రం పారిస్ నగరంపై ఐసిస్ ఉగ్రవాదులు దాడులు చేసిన తరువాత, ఆ దేశ భద్రతా దళాలు, నిఘా వర్గాలు ఉగ్రవాదుల కోసం నగరాన్ని జల్లెడ పట్టారు. సెయింట్ డెనిస్ అనే ప్రాంతంలో ఒక అపార్టుమెంటులో ఒక ఫ్లాట్ కొందరు ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు నిఘావర్గాలు కనుగొన్నాయి. తక్షణమే ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఆ సంగతి పసిగట్టిన ఉగ్రవాదులు భద్రతా దళాలపై ఎదురు కాల్పులు జరపడంతో వారు ఎక్కడ నక్కి ఉన్నారో భద్రతాదళాలు చాలా సులువుగా కనుగొనగలిగాయి.
ఉగ్రవాదులు ఉంటున్న భవనాన్ని భద్రతాదళాలు చుట్టుముట్టగానే లోపలి నుండి ఒక మహిళా ఉగ్రవాది బయటకు వచ్చి తనను తాను పేల్చి వేసుకొని ఆత్మాహుతి దాడికి ప్రయత్నించింది. కానీ భద్రతా దళాలు చాలా అప్రమత్తంగా ఉండటంతో ఆ దాడిలో ఎవరూ చనిపోలేదు కానీ ఆమెతో బయటకు వచ్చిన మరొక ఉగ్రవాది చనిపోయినట్లు సమాచారం. ఆ ప్రేలుడు దాటికి పరిసర ప్రాంతాలలో ఇళ్ళ కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఉగ్రవాదులకి, భద్రతా దళాలకి సుమారు ఏడు గంటలపాటు హోరాహోరీ కాల్పులు జరిగాయి. భద్రతా దళాలను ఉగ్రవాదులు అన్ని గంటల పాటు నిలువరించగలిగారంటే, వారు ఎన్ని ఆయుధాలు సిద్దం చేసి ఉంచుకొన్నారో అర్ధం అవుతోంది. వారు త్వరలో మరో దాడికి పాల్పడేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా వారి ఫోన్ సంభాషణలపై నిఘా ఉంచిన స్వాట్ (స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్) కనుగొంది.
ఈ భీకర పోరాటంలో ఐదుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు కానీ ఐదుగురిని సజీవంగా బందించగలిగారు. బందీలుగా చిక్కిన వారిలో ముగ్గురు ఉగ్రవాదులని పారిస్ ప్రాసిక్యూటర్ ఫ్రాన్కొయిస్ మోలిన్స్ ప్రకటించారు. కానీ పారిస్ నగరంపై జరిగిన దాడుల ప్రధాన సూత్రధారి అబ్దెల్ హమీద్ అబ్బావుద్ తమ అధీనంలో లేడని, అతను కాల్పులలో చనిపోయాడా లేదా అనే విషయం ఇంకా విచారణలో తేలవలసి ఉందని అయన తెలిపారు.