పాక్ టూరిజం టు టెర్రరిజం!.. ఏ వార్ ఫేర్
posted on May 10, 2025 2:54PM

అవి మనకు స్వాతంత్రం వచ్చిన రోజులు. భారత దేశంలోనే అతి పెద్ద సంస్థానం జమ్మూ- కాశ్మీరం. కశ్యప మహా ముని పేరిట వెలసిన కాశ్మీర్ కి రాజు రాజా హరిసింగ్. వెళ్తూ వెళ్తూ బ్రిటీష్ ఇండియా చేసిన పని.. ఎవరి స్వేచ్ఛ మేరకు వారు భారత్- పాక్.. లలో ఏ దేశంలోనైనా అయినా కలవచ్చన్న మెలిక పెట్టడం.
అప్పటికి స్వాతంత్రం పొందిన దేశాలు భారత్, పాక్, శ్రీలంక, బర్మా. వీటిలో భారత్- పాక్ మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు చాలానే. దానికి తోడు ఇక్కడున్న మరో మెలిక ఏంటంటే.. హిందుస్థాన్ లో హిందువులు, పాకిస్థాన్ లో పాకిస్థానీయులు అంటే ముస్లిములు ఉండాలన్నది ఒక షరతు కాగా.. మన భారత దేశంలో ఇంకా మూడొంతుల్లో ఒక వంతు ముస్లిములు అలాగే ఉండి పోయారు. అయినా సరే ఇరు వర్గాల మధ్య హిందూ- ముస్లిం- సిక్ వంటి జాతుల మధ్య బీభత్సమైన సంఘర్షణలు జరగ్గా ఆ ఘర్షణల్లో 2 లక్షల నుంచి 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతే స్థాయిలో నిరాశ్రయులు అయ్యారు కూడా.
ఈ లోగా రాజాహరిసింగ్ నేతృత్వంలోని కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలపైకి గిరిజన ఇస్లామిక్ గ్రూపులు పాక్ సైన్యం సాయంతో దాడులు చేశారు. వీరి బాధ ఏంటంటే రాజా హరిసింగ్ ఎక్కడ తన సంస్థానాన్ని భారత్ లో కలిపేస్తాడో అన్నదే. పాక్ అత్యుత్సాహం, గిరిజన ఇస్లామిక్ గ్రూపుల దుందుడుకు తనం పెచ్చరిల్లి రాజా హరిసింగ్ కి చిరాకు తెప్పించాయి. ఒక రకంగా ఆందోళన కలిగించాయి. ఇలాంటి వారి నుంచి ఈ చల్లటి కశ్మీరం రక్షణ పొందాలంటే వీరికంటే అమేయ పరాక్రమమైన భారత్ పరిధిలో ఈ దేశం ఉండాలని భావించారు రాజా హరిసింగ్. అందులో భాగంగా భారత్ వైపే కశ్మీర్ సంస్థానం కలిసేలా ఒప్పంద పాత్రాలపై సంతకాలు చేశారు. దీంతో ఐక్య రాజ్య సమితి సైతం తీర్మానం చేసింది.
ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. పాకిస్థాన్ కి ఒళ్లు మండింది. కశ్మీర్ లో అత్యధికంగా ఉన్న ముస్లిమ్ జనాభాను అనుసరించి చూస్తే.. ఈ ప్రాంతం కలవాల్సింది పాక్ లో. అంతే కాకుండా వారి మరో కాంక్ష ఏంటంటే.. కశ్మీరం భూతల స్వర్గం. స్విట్జర్లాండ్ ఆఫ్ సౌత్ ఏషియా. ఈ ప్రాంతం కానీ తమ గుప్పెట్లో ఉంటే.. మనం ఎంచక్కా పర్యాటకం ద్వారా విశేషమైన ఆదాయాన్ని సముపార్జించుకోవచ్చు. అన్నది వీరి ఆశ. ఆశయం.
అయితే ఈ ఆశలపై రాజా హరిసింగ్ నీళ్లు కుమ్మరించడంతో వీరికి ఆ నాటి నుంచి ఈ నాటి వరకూ.. ఆ కోరిక అలాగే ఉండి పోయింది. కారణమేంటంటే వారికి దక్కిన భూభాగమంతా ఎడారిని తలపిస్తుంది. పేరుకది పవిత్ర దేశమే కానీ అంతా అపవిత్రం కావడానికి గల కారణం.. ఆ దేశానికంటూ సొంత కాళ్ల మీద నిలబడే సత్తా లేక పోవడం.
సింధూజలాలు ఎక్కడో పుట్టి ఎక్కడి నుంచో తమ దేశంలో ప్రవహిస్తేగానీ.. ఇక్కడ వారి పంటలకు దిక్కూ మొక్కూ లేదు. అంతే కాదు ఈ జలాల ద్వారా పండే పంటలతో ఆ దేశ జీడీపీలో 24 శాతం ఆదాయం మాత్రమే లభిస్తుంది. అదే కాశ్మీర్ కూడా తమ సొంతమైతే.. వారు పర్యాటకంగానూ విశేషమైన ఆదాయ వనరులను పొందవచ్చు. ఇక్కడే పాక్ ఆశలకు భారీగా చెక్ పెట్టినట్టయ్యింది రాజా హరిసింగ్.
అలాగని ఇది కేవలం ఆయన నిర్ణయమని అనుకోవడానికి వీల్లేదు. ఆ నాడు పాక్ ఇస్లామిక్ ట్రైబల్ గ్రూపులకు తన దళాల సాయం అందించకుండా ఉండాల్సింది. కానీ, రాజాహరిసింగ్ హిందువు కావడం. దానికి తోడు ఈ ప్రాంతం పేరు కూడా ఒక హిందూ ముని కశ్యపుడి పేరిట ఉండటంతో.. ఆయన కూడా హిందువులు అత్యధికంగా ఉన్న హిందుస్తాన్ లో కశ్మీర్ కలవడమే సమంజసం అనుకున్నారు. అందుకే ఈ ప్రాంతంలోని కశ్మీరీ పండిట్లను బలవంతానా ఏరి పారేసింది కశ్మరీ ముస్లిములు. అదే తర్వాతి రోజుల్లో కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చేలా చేసింది.
పాకిస్థానీయులు ఇక్కడే చావు దెబ్బ తిన్నారు. వారు తమ అత్యుత్సాహ ప్రదర్శన చేయకుండా.. దౌత్య పరంగా ఎంతో సంయమనంతో ప్రవర్తించి ఉండాల్సింది. ఆచీ- తూచి వ్యవహరించి ఉండాల్సింది. రాజు మీద ఒత్తిడి తేకుండా ఉండాల్సింది. అలా చేసి ఉంటే.. వారి బిహేవియర్ నచ్చి ఉంటే రాజా హరి సింగ్ మనసు మారి ఉండేదేమో కానీ.. అలా జరగలేదు. ఇక్కడే పాకిస్థాన్ కొంప మునిగింది.
అలాగని భారత్ కి వరంగా ఏమీ మిగల్లేదు కాశ్మీర్. అదింకా రక్త స్రావం చేస్తూనే ఉంది. ప్రాణ నష్టానికి కారణం అవుతూనే ఉంది. ఇప్పటి వరకూ నాలుగు యుద్ధాలు జరగ్గా. వీటిలో 1971లో జరిగిన యుద్ధమొక్కటే కాశ్మీర్ కేంద్రంగా జరగలేదు. అది తూర్పు పాకిస్థాన్ అలియాస్ బంగ్లాదేశ్ కోసం జరిగింది. అది కూడా ఈస్ట్ వెస్ట్ పాకిస్తానీయులైన ముజబుర్ రెహమాన్, యాహ్యాఖాన్, భుట్టోల మధ్య సాగిన రాజకీయ పోరు కారణంగా జరగ్గా.. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ఆవిర్భావమైంది. ఈ ప్రాంతంలోని కోటి మంది బెంగాలీలు భారత్ వైపునకు బలవంతంగా రావాల్సి వచ్చింది. ఈ యుద్ధ సమయంలోనే పాక్ జలంతర్గామి ఘాజీ విశాఖ తీరంలో అనుమానాస్పదంగా మునిగింది.
మిగిలిన అన్ని యుద్ధాలు, ఘర్షణలకు కశ్మీరే కీలకం. అసలు 1947- 48లో జరిగిన తొలి ఇండో- పాక్ యుద్ధాన్ని తొలి కాశ్మీర్ వార్ గా పిలుస్తారు. తర్వాత కార్గిల్ వరకూ జరిగిన యుద్ధాల్లో ఇరు పక్షాలకు అపారమైన ప్రాణ నష్టం సంభవించింది. ఒక్క కార్గిల్ వార్ లోనే పాక్ 4 వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఆకాంక్షతోనే పాక్ లో ఉగ్రవాదం పురుడు పోసుకుంది. టూరిజం బదులు టెర్రరిజం పుట్టుకొచ్చింది. సౌత్ ఏషియా టెర్రర్ పోర్టల్ నివేదిక ప్రకారం ఒక్క పాకిస్తాన్ లోనే 80 నిషిద్ధ టెర్రరిస్టు గ్రూపులుంటే వీటిలో 45 వరకూ ఉగ్ర ముఠాలు ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయి. వీటిలోనూ లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ భారత్ అంటేనే రగిలిపోతాయి. ఈ ఉగ్ర సంస్థలు భారత్ పై చేసే యుద్ధమంటే.. దేశం కోసం చేసే యుద్ధంగా భావిస్తాయి. అందుకే వీరి సహాయ సహకారాలను ఒక పవిత్ర కార్యంగా భావిస్తుంది పాక్ ఆర్మీ. రవూఫ్ లాంటి టెర్రరిస్టులు మరణిస్తే.. వారికి తమ జాతీయ జెండాలను కప్పి మరీ అంత్యక్రియలను లాంఛనంగా నిర్వహిస్తుంది.
ఎప్పుడైతే కాశ్మీర్ టూరిజం కోల్పోయిందో పాకిస్థాన్.. ఈ అంశం ద్వారా లబ్ధి పొందాల్సింది కాస్తా.. టెర్రరిజం అనే దానికి కేంద్ర స్థానంగా నిలిచింది. దీంతో ప్రపంచానికి టెర్రరిస్టులను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది. రష్యాతో యురోపియన్ దేశాల పోరులో యురోపియన్ల వైపు నిలిచి.. రష్యాకు వ్యతిరేకంగా తన టెర్రరిస్టు కార్యకలాపాలను అరువుగా ఇచ్చింది. ప్రస్తుతం ఇదే యురోపియన్ దేశాలు పాక్ అంటేనే మండి పడుతున్నాయ్. లాడెన్ అయితే ఈ కక్ష కొద్దీ.. అమెరికాపై దాడులు నిర్వహించి.. తద్వారా అమెరికా తదితర దేశాలకు బద్ధ శతృవుగా మారాడు. యూఎస్ ఆర్మీ పాకిస్తాన్ అబోతాబాద్ లో ఆశ్రయం పొందుతున్న అతడ్ని మట్టుబట్టి తమ కడుపుమంట చల్లార్చుకుంది.
ప్రస్తుతం ఈ దేశ టెర్రరిజానికి రెండు కళ్లుగా వ్యవహరిస్తున్న వారు హఫీజ్ సయీద్, మసూద్ అజర్.. కాగా.. ఈ ఇద్దరూ ఇప్పటి వరకూ చేసిన అకృత్యాల కారణంగా భారత్ కి కొన్ని వందల సంఖ్యలో ప్రాణహాని జరిగింది. మన పార్లమెంటు దాడి, ముంబై దాడి, పుల్వామా దాడి, తాజాగా జరిగిన పహల్గాం దాడి.. అన్నిటికీ వీరే బాధ్యులు. ఈ ఇద్దర్ని భారత్ కు అప్పగించాల్సిందిగా పాక్ ను డిమాండ్ చేస్తోంది భారత్. అప్పుడే ఈ ఆపరేషన్ సిందూర్ ని ఆపుతామన్న అల్టిమేటం జారీ చేస్తోంది.
అయితే మసూద్ అజర్ తన తమ్ముడు, అక్కతో సహా దాదాపు తన కుటుంబాన్ని కోల్పోయినట్టు కనిపిస్తోంది. హఫీజ్ సయీద్ సైతం తన కొడుకు తల్హాను ముజఫరాబాద్ దాడుల్లో కోల్పోయాడన్న వార్తలు వస్తున్నాయి. హఫీజ్ సైతం ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చన్న రిపోర్టులు అందుతున్నాయి. మరి చూడాలి.. ఈ యుద్ధం ముగిసేనాటికి పాక్ కి ఏం మిగులుతుందో. భారత్ ఎలాంటి విజయం సాధిస్తుందో తేలాల్సి ఉంది.
అయితే ఇప్పటి వరకూ జరిగిన అనేక యుద్ధాలు, సంఘర్షణల్లో పాక్ ది ఘోర పరాజాయల పరంపరే సాగుతోంది. ప్రస్తుతం కూడా ఆ దేశ పార్లమెంటులో ఒక ఎంపీ ఇదే అంశాన్ని నిలదీశాడు. పాక్ ప్రధాని ఓ పిరికిపందగా అభివర్ణించాడు. అంతే కాదు ఆ దేశ సైన్యాధ్యక్షుడు మునీర్ అసీం అల్లాపై భారం వేశాడు. నో ప్లాన్స్.. ఓన్లీ ప్రేయర్స్ అంటూ చేతులెత్తేశాడు. ఇక ఇమ్రాన్ ఖాన్ అనుచరులైతే.. మీకంత దమ్ము లేదు కానీ మా ఇమ్రాన్ని విడుదల చేసి పాక్ ని కాపాడండీ అంటూ నినాదాలు జారీ చేస్తున్నారు.
ఇటు చూస్తే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే పాక్ ని ఇదే అదునుగా చావు దెబ్బ తీయాలని చూస్తోంది. ఇప్పటికే క్వెట్టాతో సహా మూడింట రెండొంతులు తాము స్వాధీన పరుచుకున్నామని అంటోంది. ఈ క్రమంలో అంతర్యుద్ధం సైతం పాక్ ఫేస్ చేస్తోంది. ప్రజల్లో కూడా ప్రభుత్వం, సైన్యం మధ్య తీవ్ర నిరాశా నిస్పృహలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ రక్షణ మంత్రి ని పార్లమెంటు ప్రశ్నించగా.. వ్యూహాత్మకంగానే తాము భారత దాడులు తిప్పి కొట్టడం లేదన్న డొల్ల సమాధానాలు చెబుతున్నాడు. ఇక ఆర్ధికంగా మాకు సాయం చేయండంటూ చందాలు కోరుతూ.. ఎక్స్ లో ఒక పోస్టు పెట్టి మరింత అభాసు పాలైంది.. పాకిస్థాన్. ఇలా ఎవరైనా దేబిరిస్తారా? అని నిలదీస్తే.. తమ అఫిషియల్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ బుకాయిస్తోంది.
ఇలా ఏ కోణంలో చూసినా కూడా పాకిస్థాన్ ప్రస్తుతం సజావుగా కనిపించడం లేదు. ఇప్పటికే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మందుగుండు సామాగ్రి కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ఒక పక్క చూస్తే మన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ పోర్టును ధ్వంసం చేసింది. కేవలం టర్కీ ఇచ్చిన డ్రోన్ షూటర్ల సాయంతో భారత్ ను ఇరుకున పెట్టాలన్న కోణంలో తీవ్ర యత్నాలు చేస్తోంది పాక్. వాటిని కూడా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేస్తున్నాయ్. చైనా సహకారమూ అంతంత మాత్రమే. అవి ఇచ్చిన ఆయుధాలు ఎంత మాత్రం పని చేయడం లేదు. పైపెచ్చు పేల్చిన చోటే పేలిపోతున్నాయ్...
ఇలా చెప్పుకుంటూ పోతే పాక్ ప్రస్తుత పరిస్థితి అగమ్య గోచరం. ఇక మిగిలింది అణుబాంబు. నేషనల్ ఫుడ్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం ఈ రెండు దేశాల మధ్య అణుయుద్ధం వస్తే జరిగే ప్రాణ నష్టం 2 బిలియన్ల వరకూ ఉంటుంది. అంటే 200 కోట్ల మేర ప్రాణ నష్టం సంభవిస్తుందని అర్ధం.
ఇలా భారత్ పాక్ మధ్య గొడవ టూరిజం నుంచి మొదలై టెర్రరిజం వరకూ వచ్చి.. ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ క్లైమాక్స్ ఏంటో అర్ధంకాని పరిస్థితి వరకూ వచ్చింది. తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవుడికే ఎరుక!!!