హైదరాబాద్ లో బాణసంచా కాల్చడంపై నిషేధం : సీవీ ఆనంద్
posted on May 10, 2025 2:59PM

హైదరాబాద్ జంట నగరాల్లో బాణా సంచా కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. సిటీ పోలీస్ యాక్ట్ 1348 సెక్షన్ 67(C) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తక్షణమే నగరంలో బాణసంచా కాల్చడాన్ని నిషేదిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేసారు. సరిహద్దుల్లోని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నందున నగరంలో బాణసంచా కాల్చడం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరిగే అవకాశం ఉందని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బాణసంచా శబ్దాలు పేలుళ్ల శబ్దాలను పోలీఉండటంతో ఇది ప్రజల్లో అనవసరమైన గందరగోళానికి దారితీయవచ్చు. శాంతి భద్రతలను కాపాడటం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ నిషేదాజ్ఞలు జారీ చేశారు.
ఈ నిషేదం తక్షణమే అమలులోకి వస్తుందని సీపీ వెల్లడించారు. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరిహద్దుల్లో పరిస్థితులు చక్కబడే వరకు ఈ నిషేధం కొనసాగే అవకాశం ఉందని, నగర ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పోలీస్ శాఖ కోరింది. బాణసంచా శబ్దాలు ప్రజల్లో అనవసర భయాందోళనలు రేకెత్తించవచ్చని, పేలుళ్ల శబ్దాలను తలపించి గందరగోళానికి దారితీయవచ్చని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. నగరంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటం, పౌరుల భద్రతకు భరోసా కల్పించడమే ఈ నిషేధం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.