శానిటైజర్లు అతిగా వాడినా ప్రమాదమే
posted on Jul 25, 2020 5:38PM
కరోనా నివారణలో శానిటైజర్లు, మాస్కులు కీలకంగా పనిచేస్తాయని తెలిసిందే. అయితే చేతులను శుభ్రపరుచుకోవడానికి ఉపయోగించే శానిటైజర్లను అతిగా వాడినా ప్రమాదమేనంటూ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
"ఇదొక అసాధారణ స్థితి. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మాస్కులు వాడండి. తరచు వేడినీళ్లు తాగుతుండండి. చేతులు శుభ్రంగా కడుక్కోండి. అయితే శానిటైజర్లను మాత్రం అతిగా వాడొద్దు" అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఆర్కే వర్మ తెలిపారు.
కాగా, ఇంతకుముందు కూడా శానిటైజర్లపై ఆరోగ్య నిపుణులు పలు హెచ్చరికలు చేశారు. అతిగా హ్యాండ్ శానిటైజర్లు వాడటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే బాక్టీరియా సైతం చనిపోతుందని తెలిపారు. సబ్బు, నీళ్లు అందుబాటులో ఉన్నప్పుడు శానిటైజర్లకు బదులుగా వాటిని ఉపయోగించి చేతులు శుభ్రపరుచుకోవడం శ్రేయస్కరం అని నిపుణులు చెబుతున్నారు.