సచివాలయం కూల్చివేతపై మీడియా అనుమతికి ససేమీరా
posted on Jul 25, 2020 5:17PM
హైకోర్టు సూచనలు కూడా ఖాతరు చేయని వైనం
విచారణ సోమవారానికి వాయిదా
తెలంగాణ సచివాలయం కూల్చివేతల కవరేజ్ కు అనుమతి ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పారు. మీడియా ప్రసారాలకు అనుమతి ఇవ్వాలని కంపెనీ ఉద్యోగులు వేసిన పిటిషన్ చెల్లదని ఆయన అభ్యంతరం చెప్పారు. అయితే కంపెనీ భాగస్వాములతో ఇంప్లీడ్ పిటిషన్ వేయిస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. మీడియాకు ఎందుకు అనుమతి ఇవ్వలేరు అన్న విషయంపై కౌంటర్ అఫిడవిట్ సోమవారం లోగా దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు ఏ చట్టం ప్రకారం పోలీసులను కాపలా పెట్టారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. సచివాలయం చుట్టూ ట్రాఫిక్ మళ్ళిస్తున్న ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం ప్రజల కదలికలను నియంత్రిస్తుందో చెప్పాలన్నారు. ప్రభుత్వం మీడియాకు అనుమతి ఇవ్వకపోవడంతో అనేక అనుమానాలకు దారి తీస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.