యూటర్న్ లు ఇంకెన్నాళ్లు
posted on Jul 25, 2020 6:05PM
ప్రభుత్వ చర్యలతో వాహనదారులకు ఇబ్బందులు
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిన్ ను తగ్గించాలన్న ఆలోచనతో కోట్లాది రూపాయల ఖర్చుతో మెట్రోరైలు నిర్మాణం ప్రారంభించారు. ఏండ్ల తరబడి మహానగరం రోడ్డల్నీ ఖరాబు చేసి మరీ మెట్రో పిలర్ల కోసం గుంతలు తవ్వారు. ఈ సందర్భంగా అనేక చోట్ల ముందస్తు జాగ్రత్తల కోసం, ట్రాఫిక్ జామ్ లు కాకుండా, ప్రమాదాలు జరగకుండా యూటర్న్ లు ఏర్పాటు చేశారు. అసలే పెట్రోలు ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో సగటు వాహనదారులు మెట్రో వస్తే ట్రాఫిక్ జామ్ లు తగ్గతాయన్న ఆశతో కిలోమీటర్ల దూరం యూటర్న్ లను ఫాలో అయ్యారు. లీటర్ల కొద్ది పెట్రోల్ ను మెట్రో పుణ్యామా అని ఖర్చు చేసి జేబులకు చిల్లులు పెట్టుకున్నారు. మెట్రో వచ్చింది. అయినా ట్రాఫిక్ తగ్గలే.. యూటర్న్ ల గోల తప్పలే.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద, రాచకొండ కమిషనరేట్లలో దాదాపు 325 చౌరస్తాలు ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా కాకుండా యూటర్న్ ల ద్వారా ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. దాంతో రోజుకు సగటున 70కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఫర్లాంగ్ దూరం వెళ్లడానికి కిలోమీటర్ల మేరకు యూటర్న్ తీసుకోవల్సిన దుస్థితి నెలకొన్నది. ఈ యూ టర్న్ ల కారణంగా అదనంగా ఇంధనం ఖర్చు అవుతుంది. కాలుష్యం పెరగడంతో పాటు వాహనదారుడిపై అదనపు భారం పడుతుంది.
కరోనా కారణంగా లాక్ డౌన్ సమయంలో రోడ్డన్నీ నిర్మనుష్యంగా ఉన్నా అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లేవారికి ఈ యూటర్న్ లు తిరగక తప్పలేదు. ఇప్పడు పబ్లిక్ ట్రాన్ ఫోర్ట్ అంతా బంద్ చేసినా యూటర్న్ లను మాత్రం ఓపెన్ చేయలేదు. దాంతో కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణం చేస్తూ లీటర్ల కొద్ది పెట్రోల్ కు డబ్బులు ఖర్చు చేస్తూ సగటు వాహనదారులు బావురు మంటున్నారు.
ఐదు కిలోమీటర్లు అదనంగా..
సచివాలయం కూల్చివేత కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి అంటూ అదనంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో తల చుట్టూ రోకలి పొటు అన్న విధంగా హైదరాబాద్లో వాహనదారుల పరిస్థితి తయారైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లను కలిపే ట్యాంక్ బండ్ రోడ్డును మూసేశారు. లిబర్టి వద్ద రాకపోకలు నిషేధించారు. ఖైరతాబాద్, బషీర్ బాగ్, నెక్లస్ రోడ్డులు బంద్ చేయడంతో ఉద్యోగస్తులు, ఉపాధి కార్మికులు అదనంగా రోజూ కనీసం ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రజల తిప్పలు పట్టని ప్రభుత్వం మాత్రం యధేచ్ఛగా తన పని తాను చేసుకుంటూ పోతుంది.
మౌనంగా భరించడం తప్ప..
ట్రాఫిక్ లేకపోయినా యూటర్న్ ను మాత్రం తొలిగిస్తరేరు. ప్రశ్నించే గొంతకలు మౌనంగా ఉంటే మనం యూటర్న్ ల చుట్టూ తిరగాల్సిందే తప్ప ప్రజాస్వామ్య విలువల మరిచిపోయి అవినీతిలో కూరుకుపోయినా ఈ ప్రభుత్వాలు మాత్రం యూటర్న్ తీసుకోవు. ప్రజలను పట్టించుకోవు అంటూ సగటు పౌరులు తనలో తాను గొణుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు. కోర్టులు చెప్పినా వినని ఈ ప్రభుత్వాలు మనం చెబితే వింటాయా అంటూ నిట్టూరుస్తున్నారు.