బీజేపీది అతి విశ్వాసమా?.. అపజయ అంగీకారమా?
posted on Nov 5, 2025 2:25PM
.webp)
తెలంగాణలో బీజేపీది అతి విశ్వాసమో, అపజయ అంగీకారమో తెలియని పరిస్థితి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలుపునకు తొలి అడుగుగా ఆ పార్టీ గంభీరంగా చెబుతున్నప్పటికీ.. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ ప్రచారం తీరు తెన్నులు చూస్తుంటే గెలుపు విషయంలో పెద్దగా నమ్మకం కలగడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఎన్నికలకు ముందు వరకూ రాష్ట్రంలో అధికారం చేపట్టడమే తరువాయి.. ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాదన్న రీతిలో వ్యవహరించిన కమలం పార్టీ ఆ తరువాత చతికిల పడింది. అధికారం సంగతి అటుంచి కనీసం రెండో స్థానంలో కూడా నిలబడలేకపోయింది.
ఇక గత రెండేళ్లలో రాష్ట్రంలో బీజేపీ ఒకింత బలహీనపడిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ పెద్దగా కనిపించడం లేదు. పార్టీ అభ్యర్థి ఎంపికకే చాలా సమయం తీసుకున్న ఆ పార్టీ.. ప్రచారంలోనూ వెనుకబడింది. ప్రచార సరళిని బట్టి చూస్తుంటే జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ అన్న అభిప్రాయం కలుగుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన పార్టీలతో బీజేపీ పొత్తులో ఉంది. కేంద్రంలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేనలు భాగస్వాములుగా ఉన్నాయి. అయినా కూడా బీజేపీ తెలంగాణలో తెలుగుదేశం మద్దతును ఇప్పటి వరకూ కోరిన దాఖలాలు లేవు. ఎవరు ఔనన్నా కాదన్నా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అయినా కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీ మద్దతును కూడగట్టుకునే విషయంలో పెద్ద ఆసక్తి కనబరచడం లేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు జనసేన తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ను కలిసి మద్దతు కోరారు కానీ.. తెలుగుదేశం వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. జూబ్లీ ప్రచార పర్వం మరో ఆరు రోజులలో ముగియనుంది. పోలింగ్ ఈ నెల 11న జరుగుతుంది. అంటే సరిగ్గా వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికీ బీజేపీ ప్రచారం పుంజుకోలేదు.
ఇలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తటస్థంగా ఉంది. పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన ఆదేశాలేమీ లేకపోవడంతో తెలంగాణ తెలుగుదేశం శ్రేణులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకనేత అయిన రేవంత్ రెడ్డి పట్ల తెలంగాణ తెలుగుదేశంలో సాఫ్ట్ కార్నర్ ఉంది. తెలుగుదేశం శ్రేణుల మద్దతును ఇప్పటికే రేవంత్ కోరినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీ తెలుగుదేశం మద్దతును బహిరంగంగా కోరలేదు.
అలా కోరితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిస్సందేహంగా బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలు తెలంగాణ వ్యతిరేక పార్టీగానే చూస్తున్నట్లుగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా తెలంగాణలో బీజేపీ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందంగా ఉండిపోవడానికి ప్రధాన కారణం మాత్రం ఆ పార్టీ అతి విశ్వాసమేనని పరిశీలకులు అంటున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినంత వరకూ అది అతివిశ్వాసమా? అపజయ అంగీకారమా? తెలియడం లేదని చెబుతున్నారు.