నాగబాబు పరిణితి.. కూటమికి మంచిదేగా!

మెగా బ్రదర్ నాగబాబు.. ఈ పేరు వినగానే ముందు వెనుకలు ఆలోచించకుండా, పర్యవశానాల గురించి పట్టించుకోకుండా దురుసు వ్యాఖ్యలు చేస్తారన్న అభిప్రాయమే సర్వత్రా వినిపిస్తుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు పలు సందర్భాలలో తెలుగుదేశం, జనసేన పార్టీలను సమస్యలలోకి నెట్టేశాయి కూడా. ముఖ్యంగా పిఠాపురం వర్మ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య సయోధ్య బీటలువారేలా చేశాయి. 

నాగబాబును తన కేబినెట్ లోకి తీసుకుంటానంటూ గతంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబా బునాయుడు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ అది జరగలేదనుకోండి అది వేరే సంగతి. కానీ చంద్రబాబు నాగబాబుకు కేబినెట్ బెర్త్ అనగానే తెలుగుదేశం శ్రేణులలో అసంతృప్తి వ్యక్తం అయ్యింది. ఆ అసంతృప్తిని తెలుగుదేశం క్యాడర్ దాచుకోలేదు కూడా. ఇందుకు కారణం గతంలో నాగబాబు తెలుగుదేశం పార్టీపైనా, పార్టీ అధినేత చంద్రబాబుపైనా చేసిన విమర్శలే అనడంలో సందేహం లేదు. అది పక్కన పెడితే నాగబాబు ఎమ్మెల్సీ అయిన తరువాత కూడా తన వైఖరి మార్చుకోలేదని నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం శ్రేణులు అంటుండేవి. ఎమ్మెల్సీగా నాగబాబు తన తొలి పర్యటనను తన సోదరుడు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురం నుంచే మొదలు పెట్టారు. కానీ ఆ పర్యటన ఆద్యంతం తెలుగుదేశం, జనసేన క్యాడర్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లే విధంగానే సాగింది. ఆయన పిఠాపురం పర్యటనకు పిఠాపురం వర్మను దూరంగా ఉంచడమే అందుకు కారణం. 

ఇలా ఉండగా ఇటీవలి కాలంలో నాగబాబు వ్యవహార శైలి మారిందనీ, ఆయనలో పరిణితి కనిపిస్తోందనీ పరిశీలకులు అంటున్నారు. అందుకు ఉదాహరణగా తాజాగా బాలకృష్ణ, చిరంజీవిల వివాదంపై ఆయన స్పందించిన తీరును చూపుతున్నారు. ఆ వివాదమేంటంటే.. ఇటీవల అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జగన్ ను సైకోగాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా జగన్ హయాంలో సినీమా టికెట్ల పెంపు వ్యవహారంలో జగన్ ను కలవడానికి వెళ్లిన అగ్రనటులకు అవమానం జరిగిందంటూ పేర్కొన్నారు. ఆ క్రమంలో బాలకృష్ణ చిరంజీవి పేరు కూడా ప్రస్తావించారు. చిరంజీవిని జగన్ అవమానించారన్నట్లుగా మాట్లాడారు. దానిపై చిరంజీవి వెంటనే స్పందించారు. తనకు జగన్ నుంచి ఎటువంటి అవమానం ఎదురుకాలేదంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

దీనిని వైసీపీయులు జనసేన, తెలుగుదేశం మధ్య విభేదాలుగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. అది వేరు సంగతి కానీ బాలకృష్ణ వ్యాఖ్యలపై కానీ, చిరు స్పందనపై కానీ ఇటు సీఎం చంద్రబాబు కానీ, అటు డిప్యూటీ స్పీకర్ పవన్ కల్యాణ్ కానీ బహిరంగంగా స్పందించలేదు. నాగబాబు కూడా ఈ విషయంపై ఎటువంటి కామెంట్స్ చేయలేదు.  అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై అడిగిన ప్రశ్నకు నాగబాబు.. కూటమిలో భాగస్వాములుగా మేం సంయమనంతో వ్యవహరించాలి.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అదే చేస్తున్నారు. మేం అదే అనుసరిస్తున్నాం. అనుసరించాలి కూడా అని జవాబిచ్చారు. ఇది నాగబాబులో వచ్చిన పరిణతికి నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu