22న తెలంగాణ బంద్.. ఎందుకంటే?

తెలంగాణలో మరో వివాదం రాజుకుంది. మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమం రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మార్వాడీల దాష్టీకాలు, దౌర్జన్యాలకు నిరసనగా అంటూ ఉస్మానియా యూనివర్సిటీ ఐక్యకార్యచరణ సమితి (జేఏసీ) ఈ నెల 22న అంటే శుక్రవారం తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద మీడియాతో మాట్లాడిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన మార్వాడీలు తెలంగాణ కులవృత్తులను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రజలను  దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా మార్వాడీ గోబ్యాక్ అంటూ జేఏసీ నేతలు నినాదాలు చేశారు. ఇలా ఉండగా మార్వాడీలకు వ్యతిరేకంగా రాజుకుంటున్న ఆగ్రహం, ఆందోళనపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ వినా మరెవరూ, ఏ పార్టీ ఇంత వరకూ స్పందించలేదు. బండి సంజయ్ మార్వాడీలకు మద్దతుగా నిలిచారు.

అలాగే ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్  కూడా మార్వాడీలపై ఆరోపణలను ఖండించారు. మార్వాడీ గో బ్యాక్ అనేది అర్బన్ నక్సలైట్ల కుట్రగా ఆయన అభివర్ణించారు. గుజరాతీ, మార్వాడీ, రాజస్థానీ లు వందల ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నారన్న రాజాసింగ్.. మార్వాడీ వ్యతిరేక ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu