జాతీయ రాజకీయాల్లో విపక్షాల గురి తప్పుతోందా?

2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలి, మోడీని గద్దె దించాలి. కురువృద్ద కాంగ్రెస్ పార్టీ  అధినాయకురాలు సోనియా గాంధీ మొదలు రేపో మాపో జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు  బీజేపీ ప్రత్యర్ధి పార్టీల నాయకులు అందరిదీ అదే మాట. అందుకోసమే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ‘భారత్ జోడో’ యాత్ర చేస్తున్నారు. అందుకోసమే, కమ్యూనిస్టులు ఎవరితో అంటే వారితో చేతులు కలిపేందుకు సిద్డమవుతున్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్ ఎవరి శక్తి కొలది వారు  ప్రయత్నిస్తున్నారు. ఎవరి వ్యూహాలు వారు రచించుకుంటున్నారు. మరోవంక, బీజీపే వ్యతిరేక పార్టీల నేతలు అందరినీ  రింగ్ మాస్టర్ లా ఆడిస్తున్న, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  కూడా అదే ధ్యేయంతో బీహార్ లో పాద యాత్ర ప్రారంభించారు.  

సరే 2024 ఎన్నికలకు ఇంకా చాలా దూరముంది. అంతకంటే ముందుగా తెలంగాణ సహా మరో ఐదారు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలున్నాయి, ఈ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గానూ భావిస్తునారు. అందులోనూ ఇప్పుడు గుజరాత్ హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముందు వరసలో ఉన్నాయి.మరో రెండు నెలల్లోనే ఈ రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో వుంది. ఈ రెండు రాష్ట్ర్రాలలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగితే 2024 లోక్ సభ ఎన్నికలపై, విపక్షాలు ఆశలు పెట్టుకోవచ్చని రాజకీయ పండితులు విశ్లేస్తున్నారు. 

అయితే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని ఓడించే స్థితిలో ప్రతిపక్ష పార్టీలున్నాయా? అంటే, రాజకీయ విశ్లేషకులే కాదు, వివిధ సంస్థలు నిర్వహిచిన సర్వేలు కూడా లేదనే అంటున్నాయి. గుజరాత్,  హిమాచల్ ప్రదేశ్‌  రెండు రాష్ట్రాలలోనూ మళ్ళీ బీజేపీదే గెలుపని  సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.ఇప్పటికే, వేరు వేరు సంస్థలు నిర్వహించిన సర్వేలు అదే చెప్పాయి. ఇప్పడు తాజాగా, ఏబీపీ న్యూస్‌-సీఓటర్‌  నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌ కూడా  రెండు రాష్ట్రాల్లో మరోసారి బీజేపీదే గెలుపని తేల్చి చెబుతున్నది. 

ఏబీపీ న్యూస్‌-సీఓటర్‌ ఒపీనియన్‌ పోల్‌ ప్రకారం గుజరాత్‌ అసెంబ్లీలో ఎన్నికలలో బీజేపే అధికారాని నిలబెట్టుకోవడమే కాకుండా, గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. గత ఎన్నికలలో బీజేపీ  అతికష్టం మీద  మొత్తం  182 స్థానాలకు గానూ 99 స్థానాలలో గెలిచి పరువు నిలుపుకుంది. అయితే  ఈసారి 135 నుంచి 143 వరకు స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఒపీనియన్  పోల్‌ పేర్కొంది. కాంగ్రెస్‌కు 36 నుంచి 44 స్థానాల వరకు సీట్లు దక్కవచ్చని ఒపీనియన్ పోల్ అంచనావేసింది. అలాగే 68 స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ 37-45 సీట్లలో విజయం సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్ తెలిపింది. 

ఒపీనియన్ పోల్స్ తోపాటుగా గుజరాత్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను విశ్లేషించినా బీజేపీ విజయం ఖాయంగానే కనిపిస్తోందని రాజకీయ పండితులు  పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉంది. బీజ్పీకి గట్టి పోటీ ఇచ్చింది. కానీ గడచిన ఐదేళ్ల కాలంలో  ముఖ్యంగా అహ్మద్ పటేల్ కన్ను మూసిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది.అంతే కాకుండా పటేదార్ ఆందోళనతో ఫేమ్ లోకి వచ్చిన యువనేత, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌  హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ  నాయకత్వ సమస్యను ఎదుర్కుంటోంది. ఇది హస్తం పార్టీ నేతలను కలవరపెడుతోంది. 

మరోవంక, పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన ఆమ్ ఆద్మీ గుజరాత్ లోనూ కాంగ్రెస్ ఓటుకు గండి కొడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వరసగా ఆరు పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీకి సహజంగానే రాష్ట్రంలో కొంత వ్యతిరేకత ఉంది, అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్,  ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య చీలిపోవడంతో  అది బీజేపీకి మేలు చేస్తుందని అంటున్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ సమర్ధ నాయకత్వం లేకపోవడం మైనస్ పాయింట్‌గా మారిందని అంటున్నారు,. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గుజరాత్ లో సాగితే కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రయోజనం ఉంటుందని స్థానిక నాయలు ఆశించారు.

అయితే, రాహుల్ యాత్ర రూట్ మ్యాప్ లో  గుజరాత్’, హిమాచల ప్రదేశ్ రాష్ట్రాలను చేర్చలేదు. దీంతో, గుజరాత్,హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఆశలు వదులుకుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో, రాహుల్ యాత్ర వలన వస్తుందనుకున్న మైలేజి రాకపోగా  నెగటివ్ ప్రచారానికి అవకాశం ఇచ్చిందని స్థానిక నాయకులు భావిస్తున్నారు. దీనికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌లో ఆదరణ పెరుగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకుడు, అరవింద్ కేజ్రీవాల్ వారంలో రెండు సార్లు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోనూ అదే పరిస్థితి, కని పిస్తోంది. అందుకే  బీజేపీ వ్యతిరేక పార్టీలు, 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడం  ఇప్పటికైతే, అయ్యే పని కాదనే అనిపిస్తోంది. అయితే, రాజకీయాలలో ఎప్పుడైనా, ఏదైనా జరగ వచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu